Steel Flyover Project: 


స్టీల్ ప్రాజెక్ట్‌ విషయంలో విమర్శలు..


కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్..ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో రోజులుగా వివాదాస్పదం అవుతున్న స్టీల్ ఫ్లై ఓర్ ప్రాజెక్ట్ (Steel Flyover project) విషయంలో ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అందుకే సిద్దరామయ్య ఈ ప్రాజెక్ట్‌పై వెనక్కి తగ్గాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ సిద్దరామయ్యకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. "ప్రజలు ఎంత ఒత్తిడి చేసినా తాను సిద్దరామయ్య లాగా భయపడే వాడిని కాదు" అని అన్నారు. విధాన సౌధలో కెంపెగౌడ జయంతి సందర్భంగా ఓ కీలక భేటీలో పాల్గొన్నారు డీకే శివ కుమార్. ఆ సమయంలోనే రాష్ట్రంలో చేపట్టాల్సిన పలు ప్రాజెక్ట్‌లు ప్రస్తావనకు వచ్చాయి. బెంగళూరులో ఫ్లై ఓవర్‌లు, టన్నెల్స్ నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. గతంలో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తావన రాగా...ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని భావించిన సిద్దరామయ్య వెంటనే దాన్ని పక్కన పెట్టారు. దీన్ని ప్రస్తావిస్తూనే డీకే ఇలా మాట్లాడారు. పైగా...ఇప్పుడాయన బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ కామెంట్స్ చేయడం సంచలనమవుతోంది. 


"గతంలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ బ్రిడ్జ్ కట్టాలని భావించారు. కానీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలూ వచ్చాయి. దీంతో సిద్దరామయ్య భయపడిపోయారు. అప్పటి బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్‌ మినిస్టర్ కేజే జార్జ్ కూడా వెనక్కి తగ్గారు. ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్ట్‌ని అటకెక్కించారు. ఒకవేళ అప్పుడు సిద్దరామయ్య ప్లేస్‌లో నేను ఉండి ఉంటే అసలు భయపడే వాడిని కాదు. నా దారిలో ఎవరు అడ్డం వచ్చినా ఆ అడ్డు తొలగించుకునే వాడిని"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం 


6-7 కిలోమీటర్ల వంతెన..


ఇదే సమయంలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కీలక వివరాలు వెల్లడించారు డీకే శివకుమార్. బసవేశ్వర సర్కిల్ నుంచి హెబ్బాల్ జంక్షన్ వరకూ దాదాపు 6-7 కిలోమీటర్ల మేర ఈ స్టీల్ బ్రిడ్జ్‌ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.1,761 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే..ఇందు కోసం దాదాపు 800 చెట్లను నరికేయాల్సి వస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం వల్ల వెంటనే అప్పటి సిద్దరామయ్య ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరతానని స్పష్టం చేశారు డీకే శివకుమార్. ఎవరు అడ్డం వచ్చినా ఆగనని తేల్చి చెప్పారు. సిటీలోని రోడ్లపైనా దృష్టి సారించి ఆ సమస్యకూ పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు నగర శివార్లలో శాటిలైట్ సిటీలనూ నిర్మించాలని ప్లాన్ చేస్తోంది సిద్దరామయ్య ప్రభుత్వం. బెంగళూరుపై ఒత్తిడి తగ్గించేందుకు..శివార్లలో ప్రత్యేకంగా విల్లాలు నిర్మించి అక్కడా మొబిలిటీ పెంచాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మ్యాప్‌నీ సిద్ధం చేసినట్టు సమాచారం. 


Also Read: అపార్ట్‌మెంట్‌లోకి మేకల్ని తీసుకొచ్చిన ముస్లింలు, జైశ్రీరాం అంటూ హిందువుల నిరసనలు