Devbhoomi Uttarakhand riots: చార్ ధామ్ యాత్రలకు ప్రశిద్ది చెందిన దేవ భూమి ఉత్తరాఖండ్ (Devbhoomi Uttarakhand)లో గత నాలుగు రోజులుగా అలజడి నెలకొంది. ఇక్కడి బీజేపీ(BJP) ప్రభుత్వం ముఖ్యంగా ఫైర్‌బ్రాండ్ నాయకుడు.. ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామీ(Pushkar singh Dami) వ్యవహరిస్తున్న తీరు, దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు అగ్నికి ఆజ్యం పోసినట్టు శాంతి భద్రతలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు ముందు.. ప్రధాని నరేంద్ర మోడీని మరింత ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో సీఎం వేస్తున్న అడుగులు వివాదాలకు దారితీస్తున్నాయి.
ఏం జరుగుతోంది..?
రెండు రోజుల కిందట వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(Unifarm Civil Code)ను తీసుకువచ్చారు.. సీఎం పుష్కసింగ్ ధామీ. దేశంలో స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మూలనపడి ఉన్న ఈ బిల్లును తొలిసారి తమ రాష్ట్రంలో అమలు చేయాలని కుతూహల పడ్డారు. అనుకున్నదే తడవుగా ఆయన ఈ బిల్లును ఆఘమేఘాలపై సిద్దం చేయించారు. ముసాయిదా ప్రతిని మెజారిటీ ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకించారు. అయినా.. వారి వాదనను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా.. ఏకపక్షంగా సభలో ఆమోదించుకున్నారు. అంతేకాదు. బిల్లు ప్రవేశ పెడుతున్నప్పుడు.. సీఎం చేసిన వ్యాఖ్యలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రతిపక్ష నేతలు మండి పడేలా చేశాయంటే ఆయన ఎంత దూకుడు ప్రదర్శించారో అర్థమవుతుంది. ``మేం బిల్లు తెచ్చాం. దీనిని సమర్థించేవారు మాత్రమే సభలో ఉండండి. తర్వాత జరిగే పరిణామాలకు మేం బాధ్యత వహించం`` అని చేసిన హెచ్చరిక.. ధామీకే చెల్లింది. దీంతో మెజారిటీ నాయకులు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. దీంతో బిల్లును తమ పార్టీ సభ్యులతో ఆమోదింపజేసుకున్నారు.
తర్వాత.. రావణ కాష్టం!
వివాదాస్పద ఉమ్మడి పౌర స్మృతి(UCC) బిల్లులో చేర్చకపోయినా.. అప్రకటిత ఆదేశాలు ఈ బిల్లు ఆమోదం అయిన మరుసటి క్షణం నుంచే అమల్లోకి వచ్చేశాయి. రాష్ట్రంలో ముస్లిం వర్గాలు నిర్వహించుకుంటున్న `మదరసాలను`(Madarasa) కూల్చేయాలని రాత్రికిరాత్రి ఆదేశాలు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తమ బలాన్ని ప్రదర్శించారు. బందుల్‌పురా జిల్లాలోని హల్వ్దానీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మదరసాను కూల్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ ఘటనను ఊహించిన ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరకత వ్యక్తమైంది. ఈ క్రమంలో కూల్చివేతలను అడ్డుకుంటూ... వారు రాళ్ల దాడికి దిగారు. దీనికి ప్రతిగా.. పోలీసులు తొలుత భాష్ఫ వాయు గోళాలను ప్రయోగించారు. కానీ, ఇంతలోనే పైనుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో కధ మొత్తం యూటర్న్ తీసుకుంది.
స్వయంగా ముఖ్యమంత్రి..
హల్వ్దానీ(Haldwani)లో ముస్లిం వర్గాలు తిరుగుబాటు చేయడంపై ఉప్పందుకున్న ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామీ ఆగ్రహంతో రగిలిపోయారు. కనిపించిన వారిని కనిపించినట్టుకాల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతే.. పోలీసులు తుపాకులకు పని కల్పించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 50 మంది వరకు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. అంతేకాదు.. జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా డీజీపీతో భేటీ అయ్యారు. ఆ వెంటనే ఆదేశాలు అమల్లోకి వచ్చేశాయి. అంతేకాదు.. సోషల్ మీడియాను నిలిపివేశారు. ఇంటర్నెట్ ను బంద్ చేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మొత్తంగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..
తాజాగా పుష్కరసింగ్ ధామీ తీసుకువచ్చిన ఉమ్మడి పౌరస్మృతిపై రగిలిపోతున్న ప్రతిపక్షాలకు.. తాజాగా మదరసా కూల్చివేత అంశం మరింతగా ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అదేవిధంగా రవాణాను స్తంభింప చేస్తామని వెల్లడించింది.
ఆ ఐదు సీట్ల కోసమేనా?
పార్లమెంటు(Parliament) ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి బీజేపీ ని గెలిపించుకునే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామీ దూకుడు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 5 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రధానంగా బీజేపీ పాగా వేసింది. అయితే.. వీటిలో రెండు స్థానాలు ఈ దఫా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చోట పెట్టకూడదన్న ఏకైక లక్ష్యంతోనే సీఎం దూకుడు ప్రదర్శిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.