రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి 40 రోజుల పెరోల్‌తో బయటకు వచ్చిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ (Gurmeet Ram Rahim) మరోసారి వార్తల్లో నిలిచారు. డేరా రెండో చీఫ్ షా సత్నామ్ పుట్టిన రోజు సందర్భంగా బాగ్‌పత్‌లోని బర్నావా డేరాలో రామ్ రహీమ్ ఓ ఖడ్గంతో కేక్ కట్ చేశాడు. పెరోల్ పొంది జైలు నుంచి వచ్చిన తర్వాత రామ్ రహీమ్ సంబరాల్లో మునిగిపోయాడు. వైరల్ వీడియోలో, రామ్ రహీమ్ కత్తితో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం చూడవచ్చు. రామ్ రహీమ్ వేడుకలో అతని అనుచరులు చాలా మంది కూడా పాల్గొన్నారు. పెరోల్‌పై వచ్చిన తర్వాత, ఆయుధాల చట్టం ప్రకారం శిక్ష పడిన ఖైదీ ఎవరైనా బహిరంగంగా ఆయుధాలను ప్రదర్శించడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ, రామ్ రహీమ్ కత్తితో కేక్ కట్ చేశాడు.


హత్యలు, అత్యాచారం కేసులో 2017 నుంచి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్ కత్తితో కేక్ కట్ చేస్తున్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాకుతో కేక్ కట్ చేయమని డేరా సేవాదార్ అనిల్ చావ్లా అడగ్గా, చాకుతో కాకుండా పెద్ద ఖడ్గంతో కేక్ కట్ చేయడం ఆ వీడియోల్లో ఉంది.


జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా చీఫ్ 40 రోజుల పెరోల్‌తో మూడోసారి బర్నావా ఆశ్రమానికి వచ్చారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె హనీప్రీత్, కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. మరోవైపు, పెరోల్ నిబంధనలలో పెద్ద పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించవద్దని, ఆశ్రమంలో గుమిగూడడం లాంటివి వద్దని కోర్టు నిబంధనలు ఉన్నప్పటికీ, స్థానిక పోలీసు సిబ్బంది మాత్రం ఆశ్రమం లోపలికి చాలా మందిని అనుమతిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డేరా చీఫ్ ఆశ్రమం వద్ద భారీగా ప్రజలు గుమిగూడి ఉన్నా కూడా, పోలీసులు ప్రశాంతంగా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, రామ్ రహీమ్‌ను కలవడానికి పోలీసు ఉన్నతాధికారి, ఓ ఇన్‌స్పెక్టర్ కూడా సోమవారం ఆశ్రమం లోపలికి చేరుకున్నారు.


అత్యాచార, హత్యా నేరాలు, లైంగిక వేధింపులు, జర్నలిస్టు హత్య కేసులో దోషిగా తేలి శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు మూడోసారి పెరోల్ మంజూరు చేయడంపై హరియాణా ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. జనవరి 25న షా సత్నామ్ సింగ్ పుట్టిన రోజుకు హాజరు కావడానికి పెరోల్ మంజూరు చేయాలని గుర్మీత్ రామ్ రహీమ్ దరఖాస్తు చేసుకున్నాడు. అలాగే, జనవరి 25న భండారా, సత్సంగం కోసం, డేరా సచ్చా సౌదా చీఫ్ జైలు పరిపాలనకు దరఖాస్తు పంపారు. సిర్సాను సందర్శించడానికి అనుమతి కోరారు. దీనికి ఆమోదం లభించింది. ఇంతకు ముందు కూడా రామ్ రహీమ్‌కు 40 రోజుల పెరోల్ లభించింది. హరియాణాలోని అడంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలకు ముందే రామ్ రహీమ్‌కు పెరోల్ లభించింది.


స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహణ


హరియాణాలోని హిసార్ డేరా సచ్చా సౌదాకు చెందిన డేరా ప్రేమికులు సోమవారం హిసార్‌లో క్లీనెస్ డ్రైవ్ చేపట్టారు. దీనిని డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ యూపీలోని బాగ్‌పత్ నుండి వర్చువల్‌గా స్వీప్ చేయడం ద్వారా ప్రారంభించారు. మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గౌతమ్ సర్దానా కూడా డేరా ప్రేమికులతో కలిసి రెడ్ స్క్వేర్ మార్కెట్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 22 జిల్లాల్లోని 7,422 గ్రామాలు, నగరాలు, పట్టణాలు, తహసీల్‌లు, పట్టణాల్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.


డేరా సచ్చా సౌదా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో నగర మేయర్ గౌతమ్ సర్దానా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డేరా అభిమానులతో కలిసి ఊడ్చారు. ఇంతకుముందు కూడా అక్టోబర్ 30న హిసార్ మేయర్ గౌతమ్ సర్దానా భార్య ఆన్‌లైన్ సత్సంగంలో రామ్ రహీమ్ నుండి ఎన్నికల కోసం ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. హిసార్ నగరంలో డేరా ప్రేమికులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.