ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం మరింత ముదురుతోంది. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు సంబంధించి జేఎన్ యూ, జామియా మిలియా ఇస్లామియా, పంజాబ్ యూనివర్సిటీలలో వివాదం చెలరేగింది. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో డాక్యుమెంటరీ ప్రదర్శన విషయంలో రచ్చ జరుగుతోంది. ఢిల్లీ వర్శిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ బయట శుక్రవారం (జనవరి 27) కలకలం రేగింది. ఢిల్లీ పోలీసుల ఎదుట నిరసన తెలిపిన విద్యార్థులను, ఎన్‌.ఎస్‌.యు.ఐ (NSUI) సభ్యులను, భీమ్ ఆర్మీ స్టూడెంట్ యూనియన్ కు చెందిన కొందరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భీమ్ ఆర్మీ విద్యార్థి సంఘానికి చెందిన పలువురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


144 సెక్షన్ కంటిన్యూ
ఢిల్లీ పోలీసులు మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. NSUI - KSU ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌ లో ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్లు ప్రకటించడంతో పోలీసులు వర్సిటీకి చేరుకున్నారు. వాస్తవానికి ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ఉండాలని 144 సెక్షన్ విధించారు. ఫిబ్రవరి 28 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. 2002లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గుజరాత్ అల్లర్ల ఆధారంగా బీబీసీ డాక్యుమెంటరీ "ఇండియా: ది మోడీ క్వశ్చన్" అనే డాక్యుమెంటరరీని బీబీసీ రూపొందించింది. దీనిపై ఇదివరకే నిషేధం విధించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో లింకులను బ్లాక్ చేశారు. అయినా కొన్నిచోట్ల ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నాలు జరగడంతో వివాదం ముదురుతోంది.






డాక్యుమెంటరీ ప్రదర్శనకు NSUI ప్రకటన
కాంగ్రెస్ విద్యార్థి అనుబంధ విభాగం NSUI శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శిస్తుంచనుందని ప్రకటించింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో వర్సిటీ వద్ద మోహరించారు. నార్త్ ఢిల్లీ ఏడీసీపీ రష్మీ శర్మ మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూడటంలో భాగంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 


ఢిల్లీ పోలీసుల ప్రకటన
ఢిల్లీ వర్శిటీలోని ఆర్ట్ ఫ్యాకల్టీ గేట్ వద్ద ఉండి గస్తీ కాస్తున్నామని నార్త్ జోన్ డీసీపీ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేదని, అయితే నిషేధించిన BBC డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి యత్నించిన కొందర్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రదర్శన చేయకుండా వెనక్కి వెళ్లాలని పలుమార్లు తాము సూచించిన నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వర్సిటీ గేటు లోపల సైతం డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చేసే ప్రయత్నం జరగగా, వారిని లోపలే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. 


ఐడీ కార్డులు చెక్ చేయండి
ఢిల్లీ యూనివర్శిటీ ప్రొక్టర్ రజనీ అబ్బి మాట్లాడుతూ.. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి ఐ-కార్డులు చెక్ చేసి, వాళ్లు తమ వర్సిటీ విద్యార్థులా కాదా అని నిర్ధారించాలన్నారు. ఎవరైనా బయటి నుంచి వర్సిటీకి వచ్చిన వారైతే పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారని, వర్సిటీ విద్యార్థులైతే తాము వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.