గడ్డ కట్టుకుపోయే చలి.. కాసేపు ఉంటే చాలు ప్రాణాలు పోతాయేమో అనేంత వణుకు. టెంపరేచర్ ఎంతో తెలుసా -20 డిగ్రీల నుంచి -40 డిగ్రీలు. ఇంత దారుణమైన చలిలో ఓ వ్యక్తి ఆరుబయటే పడుకుంటున్నాడు. ఓ పదినిమిషాలుంటేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో అని భయపెట్టేంత చలిలో ఈయన ఎందుకిలా చేస్తున్నాడో తెలుసుకోవాలంటే మీరు క్లైమేట్ ఫాస్ట్ అనే ఉద్యమం గురించి తెలుసుకోవాలి. జనవరి 26 నుంచి ఐదు రోజుల పాటు సోనమ్ వాంగ్ చుక్ అనే వ్యక్తి చేస్తున్న ఈ ఉద్యమం లద్దాఖ్ రక్షణ గురించి. All is not Well in లద్దాఖ్ అంటూ సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న ఈ కఠోర దీక్ష వెనుక 70 ఏళ్ల లద్దాఖ్ వాసుల ఆవేదన ఉంది. 


వాంగ్ చుక్ చెబుతున్న లద్దాఖ్ వాసుల డిమాండ్స్ ఇవే..
ఇండియన్ కానిస్టిట్యూషన్ లోని షెడ్యూల్ 6 గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రొవిజన్స్ గురించి మాట్లాడుతుంది. షెడ్యూల్ 6 ప్రకారం నాలుగు ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం లకు ట్రైబల్ ఏరియా రికగ్నైజేషన్ ఉంది. ఆర్టికల్ 244 ప్రకారం ఆ రాష్ట్రాల్లో అటానమస్ డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. స్టేట్ లో అంతర్భాగంగా ఉంటూనే ఏ జిల్లాకు ఆ జిల్లా కు వాళ్లకు లెజిస్లేటివ్. జ్యూడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఉంటుంది. ఇందుకోసం ఆ రాష్ట్రాల్లో అలా గుర్తించే ప్రాంతాల్లో50శాతం గిరిజనులు ఉండాలి. ఇప్పుడే లద్దాఖ్ వాసులు కూడా అడిగేది. రాజ్యాంగం ప్రకారం 50శాతం గిరిజనులుంటేనే ట్రైబల్ ఏరియా రిగజ్నైషన్ ఇస్తున్నప్పుడు లద్దాఖ్ లో 90శాతం గిరిజనులే. మరి మాకెందుకు ఇవ్వరు అని ఎప్పటి నుంచో లద్దాఖ్ వాసులు అడిగేది. 



బీజేపీ ఏం చెప్పిందంటే !
గతంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి చెందిన Jamyang Tsering Namgyal లద్దాఖ్ నుంచి విజయం సాధించాడు. అప్పుడు బీజేపీ మ్యానిఫెస్టోలో లద్దాఖ్ ను 6th Schedule లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చిందని వాంగ్ చుక్ చెబుతున్నారు. అప్పుడిచ్చిన మాట తప్పారనే కోపంతో 2020లో లద్దాఖ్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ కి సంబంధించిన ఎన్నికలను లద్దాఖ్ వాసులు బాయ్ కాట్ చేశారు. అప్పుడు కూడా లద్దాఖ్ వాసులు ఎన్నికలకు సహకరించాలని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలిస్తే 6th షెడ్యూల్ లో కి తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని కానీ మళ్లీ తాము మోసపోయామని వాంగ్ చుక్ అంటున్నారు. రెండుసార్లు బీజేపీ చేతిలో మోసం పోయామనేది లద్దాఖ్ వాసుల ఆవేదన. ఇదే 2019లో జాతీయ గిరిజన మంత్రిత్వ శాఖ మినిస్టర్ గా ఉన్న అర్జున్ ముండా షెడ్యూల్ ఏరియా స్టేటస్ ఇస్తామంటూ రాసిన లెటర్ కూడా గురించి కూడా వాంగ్ చుక్ ప్రస్తావిస్తున్నారు. ఇన్ని సార్లు అడిగి ఇక లాభం లేదనుకుని ఆయనే క్లైమేట్ స్ట్రైక్ కు దిగారు.






ఇంతకీ లద్దాఖ్ ను ట్రైబల్ ఏరియా ప్రకటించాలని ఎందుకంత డిమాండ్ బలంగా వినిపిస్తోంది అంటే 2019లో పార్లమెంట్ లో జమ్ము కశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగింది. జమ్ము కశ్మీర్ ను లెజిస్లేచర్ ఉన్న యూనియన్ టెర్రిటరీగా లద్దాఖ్ ను లెజిస్లేచర్ లేని యూనియన్ టెర్రిటరీగా ప్రకటించారు. ఇది జరిగిన తర్వాత లద్దాఖ్, జమ్ముకశ్మీర్ లపై ఆంక్షలు తొలగిపోయాయి. చాలా మంది లేహ్, లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో తాము నివసించాలని కోరుకుంటున్నారు. షాపింగ్ మాల్స్, రిసార్ట్స్, అంతెందుకు మైనింగ్ ఇలా పెట్టుబడిదారుల కన్ను లే లద్దాఖ్ పై పడిందనేది వాంగ్ చుక్ చెబుతున్న విషయం. తమకంటూ ట్రైబల్ ఏరియా స్టేటస్ ఉంటే ఇలా బయటి వ్యక్తులు రారని.. తమ భాష, తమ కల్చర్, వాళ్లు నివసిస్తున్న మంచుకొండలు అన్నీ కాపాడుకోవటానికి వీలైతుందనేది డిమాండ్. 
ఇటీవల కాలంలో కశ్మీర్ లో లే లద్దాఖ్ లో, మనాలిలో మంచు వేగంగా కరిపోతుంది. అక్కడ ప్రకృతి అంతా నాశనం అవుతోందని కేంద్ర ప్రభుత్వమే నివేదికలు ఇస్తోంది. పైగా నీటి కొరత కూడా ఓ సమస్య. సరాసరి లద్దాఖ్ ప్రజలు రోజుకు 5లీటర్ల నీటితోనే జీవిస్తున్నారు. మరి బయటి వ్యక్తుల వలస ప్రారంభమైతే ఎన్ని లీటర్ల నీటితో బతకాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ట్రైబల్ ఏరియా స్టేటస్ ఇచ్చి 6th షెడ్యూల్ లోకి లద్దాఖ్ ను ఎందుకు తీసుకురానని సోనమ్ వాంగ్ చుక్ లాంటి వాళ్లు అడుగుతోంది.


కేంద్రం కదిలివచ్చేలా.. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలు చూసేలా... ఈ క్లైమేట్ ఫాస్ట్ ను ఐదు రోజులు చేస్తున్నారు సోనమ్ వాంగ్ చుక్. మొదట ఖార్దూంగ్ లా పాస్ లో చేద్దామనుకున్నా... క్లైమేట్ బాగోలేదని.. రోడ్స్ మూసేసి అధికారులు అనుమతివ్వకపోవటంతో సోనమ్ వాంగ్ చుక్ తన హిమాలయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్ట్రనేటివ్స్ రూఫ్ టాప్ పైన క్లైమేట్ ఫాస్ట్ ప్రారంభించారు. మొదటిరోజు పూర్తయ్యాక కూడా ఓ వీడియో రికార్డ్ చేసి తన పరిస్థితి ఏంటో చెప్పారు వాంగ్ చుక్. దేశవ్యాప్తంగా ప్రజలు, పర్యావరణ ప్రేమికులు వాలంటరీగా స్పందించాలని... ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ మెయిల్స్ పంపించటం ద్వారా అందరూ ఇష్టపడే లద్దాఖ్ ను కాపాడాలని కోరుతున్నారు. 


ఇంతకీ ఈ సోనమ్ వాంగ్ చుక్ ఎవరో తెలుసా.... మీరంతా ఆమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమా చూశారు కదా అందులో ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ ను ఈయన ఇన్సిపిరేషన్ తోనే రాజ్ కుమార్ హిరానీ రాసుకున్నారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలని సొంతంగా తనకంటూ ఓ స్కూల్ పెట్టుకుని ఇప్పుడున్న రుద్దుడు చదువులు కాకుండా పిల్లలకు ఏం ఆసక్తి ఉందో తెలుసుకుని అదే చదువులా నేర్పిస్తూ దేశవ్యాప్తంగా ఓ ఆదర్శవంతమైన విద్యావ్యవస్థను క్రియేట్ చేశారు సోనమ్ వాంగ్ చుక్. ఇప్పుడు తను పుట్టిన ప్రాంతం కోసం గడ్డకట్టి పోయే చలిలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు.