Delhi Pollution Control Committee: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Air Pollution) రోజు రోజుకు భయంకర స్థాయికి చేరుకుంటోంది. భయంకరమైన వాయుకాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వాయుకాలుష్యాన్ని కంట్రోల్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) నిర్ణయించింది. కేంద్రం రూపొందించిన వాయు కాలుష్య నియంత్రణ ప్రణాళిక గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (Graded Respose Action Plan)ను పకడ్బందీగా అమలు చేసేందుకు ముందుకొచ్చింది. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (Special Task Force)ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వం వహించనున్నారు. ప్రజాపనులు, రవాణా, ట్రాఫిక్, రెవెన్యూ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను నాలుగు రకాలుగా విభజించారు. స్టేజ్ 1-ఏక్యూఐ 201-300, స్టేజ్ 2- ఏక్యూఐ 301-400, స్టేజ్-3 ఏక్యూఐ 401-450, స్టేజ్-4 ఏక్యూఐ 450కి మించి ఉండటం.
అన్ని విభాగాలతో సమన్వయం
కాలుష్య నియంత్రణ చర్యల అమలులో భాగమైన అన్ని విభాగాలతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సమన్వయం చేసుకుంటుందని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రతిరోజూ ప్రభుత్వానికి నివేదికను అందజేస్తుందని వెల్లడించారు. కాలుష్య నియంత్రణ చర్యల్లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. తాజాగా నిబంధనల అమలు పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. నిర్మాణ పనులపై నిషేధం విధించిన ప్రభుత్వం, కాలుష్యకారక ట్రక్కులకు అనుమతి నిరాకరించింది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడం కోసం ఆప్ ప్రభుత్వంలోని మంత్రులంతా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.
నిబంధనలను పాటిస్తున్నారా?
దేశ రాజధానిలో కాలుష్య కట్టడికి అమలు చేస్తున్న నిబంధనలను పాటిస్తున్నారా? లేదా అనే విషయాన్ని మంత్రులంతా స్వయంగా తనిఖీ చేయనున్నారు. కాలుష్య నియంత్రణ చర్యల్లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. కేంద్రం సూచించిన వాయు కాలుష్య నియంత్రణ ప్రణాళిక గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రతి మంత్రి పని చేయాలని తాము నిర్ణయించామని, వారు అంతటా తనిఖీలు చేపట్టి కాలుష్య నియంత్రణ చర్యలను సరిగా అమలయ్యేలా చూస్తారని మంత్రి గోపాల్ రాయ్ వివరించారు. మరోవైపు వాయు కాలుష్యం నివారణకు చేపట్టబోయే క్లౌడ్ సీడింగ్ వల్ల ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంటుందని ఐఐటీ కాన్పూర్ అచార్యుడు మహీంద్రా అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
జిల్లాలకు బాధ్యులుగా మంత్రులు
మంత్రులు గోపాల్ రాయ్-ఉత్తర, ఈశాన్య జిల్లాలు, కైలాశ్ గహ్లోత్-నైరుతి, పశ్చిమ జిల్లాలు, ఆతిషీ-తూర్పు, ఆగ్నేయ జిల్లాలు, సౌరభ్ భరద్వాజ్-దక్షిణ, న్యూదిల్లీ జిల్లాలు, ఇమ్రాన్ హుస్సేన్-మధ్య, షహదర జిల్లాలు, రాజ్‌కుమార్ ఆనంద్-వాయువ్య జిల్లాల బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతానికి కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉండటంతో జీఆర్‌ఏపీలోని చివరి దశ నిబంధనలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా దేశ రాజధానిలో అన్ని రకాల నిర్మాణాలను నిలిపివేశారు. ఆదివారం నుంచి గాలి నాణ్యత సూచీ తీవ్ర స్థాయికి చేరడంతో కాలుష్యాన్ని వెదజల్లే ట్రక్కుల రాకపోకలను నిషేధించారు.