Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. అంతకుముందు ఈ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ కు సన్నిహితంగా ఉన్న మరికొందరి ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. 


ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దాఖలై ఛార్జీషీట్ లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. మొదటి నుంచి సంజయ్ సింగ్ పై ఈడీ నజర్ పెట్టినప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. సోదాలపై సంజయ్ సింగ్ తండ్రి స్పందిస్తూ.. డిపార్ట్‌మెంట్ తన పని చేస్తోందని, తాము వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఈ కేసులో సంజయ్ సింగ్ కు క్లీన్ చిట్ వచ్చే వరకు వేచి ఉంటామన్నారు. 


ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్ ను సంజయ్ సింగ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు సమావేశపరిచాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. తాను ఒక కార్యక్రమంలో సంజయ్ సింగ్ ను కలిశానని, ఆ తర్వాత ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతోనూ సంప్రదింపులు జరిపినట్లు అరోరా ఈడీకీ తెలిపారు. అయితే ఇదంతా ఢిల్లీ ఎన్నికలకు ముందు నిధుల సేకరణ కోసం చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతే కాదు.. లిక్కర్ డిపార్ట్‌మెంట్ తో దినేష్ అరోరాకు ఉన్న దీర్ఘకాలిక సమస్యను ఎంపీ సంజయ్ సింగ్ పరిష్కరించారని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు చేసింది. 


ఎంపీ సంజయ్ సింగ్ అభ్యర్థన మేర దినేష్ అరోరా ఢిల్లీలో పార్టీ నిధుల సేకరణ కోసం రెస్టారెంట్ల యజమానులు రూ. 32 లక్షల చెక్కులను సిసోడియాకు అప్పగించారని ఈడీ పేర్కొంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో.. సంజయ్ సింగ్ పేరును మాత్రం నిందితుల జాబితాలో ఈడీ చేర్చలేదు. అయితే ఛార్జిషీట్ లో పేరు చేర్చినప్పటికీ.. ఇప్పటిదాకా సమన్లు జారీ చేయడం గానీ, ఆయన స్టేట్‌మెంట్ ను గానీ రికార్డు చేయలేదు.


ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు కుమారుడు మాగుంట రాఘవ అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలుకెళ్లిన మాగుంట రాఘవ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. రాఘవతో పాటు ఈ కేసులో మరో కీలక నిందితుడు దినేష్ అరోరా అప్రూవర్ గా మారడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఇప్పటికే 20 మంది నుంచి కీలక సమాచారం సేకరించింది. మనీష్ సిసోడియా తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ.. మరో ఆప్ నేత సంజయ్ సింగ్ పై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే.. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్టు చేసింది సీబీఐ. అంతే కాదు ఏప్రిల్ లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది.