Delhi road accident viral video: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. హిట్ అండ్ డ్రాగ్ కేసులో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కారు ఢీకొనడంతో స్కూటీలో వెళ్తున్న ఒకరు ఎగిరి కారు మీద పడగా అలాగే 350 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన ఢిల్లీలోని కేశవ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదంపై కేశవ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన జనవరి 26వ తేదీన రాత్రి ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్నారు. ఓ కారు స్కూటీని ఢీకొనగా, నడుపుతున్న వ్యక్తి ఎగిరి కారుపై పడ్డారు. మరో వ్యక్తి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్కూటీ నడుపుతున్న వ్యక్తి కారు బానెట్ పై పడిపోగా డ్రైవర్ వాహనం నడపకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ దాదాపు 350 మీటర్లు బాధితుడ్ని అలాగే ఈడ్చుకెళ్లారు. ఈ రోడ్డు ప్రమాదం ప్రేరణ చౌక్, కన్హయ్య నగర్ మధ్యలో జరిగింది.
నార్త్ వెస్ట్ డీసీపీ ఉషా రంగ్నాని మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 26న రాత్రి ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. వేగంగా దూసుకొచ్చిన కారు, స్కూటీని ఢీకొనడంతో ప్రమాదం జరగగా.. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా, మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారు. కారు ఢీకొనడంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి ఎగిరి కారు మీద పడిపోగా కారులోని వ్యక్తులు వాహనం ఆపకుండా ఈడ్చుకుంటూ వెళ్లారని తెలిపారు. ఇది గమనించిన పీసీఆర్ వ్యాన్ ఛేజ్ చేసి కారులోని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మిగతా ముగ్గురు నిందితులు పరారయ్యారు. వీరి నుంచి సమాచారం సేకరించిన పోలీసులు మిగతా ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేప్టినట్లు డీసీపీ ఉష వివరించారు.
ఇటీవల వరుస హిట్ అండ్ డ్రాగ్ ప్రమాద కేసులు..
గత నెలలో ఓ మహిళ సైతం హిట్ అండ్ డ్రాగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. కారు ఈడ్చుకెళ్లడంతో మహిళ దారుణమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. గుజరాత్ లోని సూరత్ లోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. 24 ఏళ్ల యువకుడు బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యువకుడి బైక్ ను ఢీకొన్న కారు అంతటితో ఆగకుండా దాదాపు 12 కి.మీ వరకు అతడ్ని ఈడ్చుకెళ్లింది. కారు కింద ఇరుక్కున్న యువకుడు ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.