CPM On Agnipath : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. అగ్నిపథ్ వల్ల దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగేళ్లకు కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడంతో వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదన్నారు. పెన్షన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్థ్యంపై రాజీపడడమేనని సీపీఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. గత రెండేళ్లుగా భారతసైన్యంలో ఎలాంటి రిక్రూట్‌మెంట్ లేదని ఆరోపించింది. ఆర్మీ రెగ్యులర్ సైనికులను రిక్రూట్ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపింది. కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేళ్ల సర్వీస్ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారని పేర్కొంది. ఈ పథకం ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుందన్నారు. వారంతా భవిష్యత్ లో ప్రైవేట్ మిలటరీగా పనిచేసే పరిస్థితులు తెస్తున్నారని తెలిపింది. ఇప్పటికే తీవ్రమైన ఒడుదుడుకులకు గురవుతున్న సామాజిక వ్యవస్థపై అగ్నిపథ్ పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయని సీపీఎం పేర్కొంది.
దేశవ్యాప్తంగా నిరసనలు
అభ్యర్థులు ఉపాధి భద్రతకు కనీస రక్షణ కూడా లేకుండానే అత్యున్నత త్యాగాలు చేయడానికి సిద్ధపడాలని యువతకు పిలుపునివ్వడం నేరపూరితమైన చర్య అని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయంటే ఈ పథకం పట్ల యువత ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో తెలిపింది. కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేసి, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ వెంటనే చేపట్టాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేస్తుంది.
అగ్నిపథ్ పై వెనక్కి తగ్గని కేంద్రం
'అగ్నిపథ్' పథకంపై వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతోన్న వేళ ఆర్మీ, వాయుసేన అధిపతులు కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద త్వరలోనే నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ ఏడాది చేరే అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
" ఈ ఏడాది జరిగే అగ్నిపథ్ నియాకాల్లో అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇది యువతకు మేలు చేస్తుంది. వాయుసేనలో అగ్నిపథ్ నియమకాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి."-వీఆర్ చౌదరి, ఎయిర్‌ఫోర్స్ చీఫ్