Delhi CM Arvind Kejriwal: దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు లోనయ్యారు. బుధవారం కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన కోర్టులో అస్వస్థతకు గురయ్యారు.  షుగర్ లెవల్ తగ్గడంతో ఆయన్ని మరో గదిలో కూర్చోబెట్టారు. టీ, బిస్కెట్లు అందజేశారు.

  


దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. అనంతరం దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది.  ఈ విచారణ క్రమంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. అంతకుముందు, మార్చి 21న ఈడీ  కేజ్రీవాల్ ని మనీలాండరింగ్ కేసులో  అరెస్టు చేసింది. ఈడీ అరెస్టు చేసిన కేసులో బెయిల్ కు సంబంధించిన విచారణ సైతం ఈ రోజే సుప్రీం కోర్టులో జరుగనుంది.  ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ ఆయన్ని అరెస్టు చేసింది.  దీనిపై సైతం  సీఎం కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.


దీనికి సంబంధించి వార్తా సంస్థ ఏఎన్ఐ విడుదల చేసిన వీడియోలో కేజ్రీవాల్ ను మరో గదికి తరలించడం కనిపించింది. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ సైతం ఆయనతో పాటు  కనిపించారు.






దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షుగర్ (Diabetes) సమస్యతో బాధపడుతున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆయన షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం నాడు తెలిపింది. ఆయన షుగర్ లెవెల్స్ ఒక దశలో 46 ఎంజీ స్థాయికి పడిపోయాయని, ఇది ప్రమాదకరమైన పరిస్థితిని అని వైద్యులు చెబుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన భార్య సునితా కేజ్రీవాల్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను జైలులో మంగళవారం కలుసుకున్నానని, ఆయన శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోతున్నాయని అన్నారు. అయితే ఆయన ధైర్యంగానే ఉన్నట్టు చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రజలంతా ప్రార్థించాలని కోరారు.


అరెస్టు బెయిలు.. లొంగుబాటు.. ఇదీ క్రమం.. 


మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఎన్నికల కోసం మధ్యంతర బెయిల్ పై మే 10న బయటకి వచ్చిన ఆయన తిరిగి జూన్ రెండున లొంగిపోయారు. జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్న ఆయనను తాజాగా సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో భాగంగా కేజ్రీవాల్ రూ. వంద కోట్ల ముడుపులు డిమాండ్ చేసినట్లు ఈడీ ఆరోపించింది. అయితే ఈ కేసులో కేజ్రీవాల్ కు ఈ నెల 20 నే బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీ లోని రూస్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనిపై స్టే విధించాలని హైకోర్టుని ఈడీ కోరింది.  దీంతో ఆయన బెయిల్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. అంతకుముందు 48 గంటల పాటు కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులను నిలిపివేయాలని రౌస్ ఎవెన్యూ కోర్టుని ఈడీ కోరింది. అయితే కోర్టు అందుకు అంగీకరించకపోవడతో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. బుధవారమే దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగునున్న సమయంలో కేజ్రీవాల్ ను తాజాగా సీబీఐ అరెస్టు చేసింది.