Bharat Bill Payment System - BBPS: క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే వాళ్లు ఇప్పుడు కాస్త అలెర్ట్‌గా ఉండాలి. వచ్చే నెల ప్రారంభం (2024 జులై 01) నుంచి, క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన కొత్త రూల్ మీపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశం
జూన్ నెల ముగియడానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగులుంది. ఆ తర్వాత, అంటే జూన్ 30, 2024 తర్వాత క్రెడిట్ కార్డ్ చెల్లింపులన్నీ "భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్" (BBPS) ద్వారా ప్రాసెస్ అవుతాయి. దీనిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) వంటి పెద్ద బ్యాంకులు ఇంకా బీబీపీఎస్‌ను యాక్టివేట్ చేయలేదు. ఈ బ్యాంకులన్నీ కలిపి 5 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులను కస్టమర్లకు జారీ చేశాయి. అంటే, కోట్లాది మంది క్రెడిట్ కార్డ్ యూజర్లపై నేరుగా ప్రభావం పడబోతోంది.
జూన్ 30 తర్వాత ఏం మారుతుంది?
రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం "భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్" కిందకు రాని బ్యాంకులు లేదా రుణదాతలు జూన్ 30 తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఆయా బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్ బిల్లులను కస్టమర్లు చెల్లించలేరు. ఫోన్ పే (PhonePe), క్రెడ్ (Cred) వంటి యాప్స్ ద్వారా కూడా ఆయా బ్యాంక్‌లకు బిల్ పేమెంట్స్ జరగవు. విశేషం ఏంటంటే.. ఫోన్ పే, క్రెడ్ ఇప్పటికే BBPSలో సభ్యులుగా ఉన్నాయి. అయితే, బ్యాంక్‌లు కూడా ఆ చెల్లింపు వ్యవస్థ కిందకు రావాలి, లేకపోతే అటు బ్యాంక్‌లకు, ఇటు కస్టమర్లకు ఇబ్బందులు తప్పవు.
గడువు పెంచాలని పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి
"భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్"ను యాక్టివేట్ చేసుకునే గడువును పొడిగించాలని పేమెంట్స్ ఇండస్ట్రీ కోరుతోంది. చివరి తేదీని మరో 90 రోజులు పొడిగించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మన దేశంలో, మొత్తం 34 బ్యాంకులు, రుణదాతలకు క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి అనుమతి ఉంది. ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఇప్పటి వరకు 8 బ్యాంకులు మాత్రమే BBPSలో బిల్లు చెల్లింపు సర్వీస్‌ను యాక్టివేట్ చేశాయి.
ఏయే బ్యాంకులు BBPSను యాక్టివేట్ చేశాయి?
ఎస్‌బీఐ కార్డ్ (SBI Card), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank), ఫెడరల్ బ్యాంక్ (Federal Bank), కోటక్ మహీంద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank) BBPSని యాక్టివేట్ చేసిన లిస్ట్‌లో ఉన్నాయి.
RBI ఎందుకు ఈ రూల్ తీసుకొచ్చింది?
మన దేశంలో, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపు రూపంలోనూ నల్లధనం చేతులు మారుతోంది. క్రెడిట్ కార్డ్‌లను అడ్డు పెట్టుకుని కొందరు ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్లుల కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థ వల్ల పేమెంట్స్ విషయంలో రిజర్వ్ బ్యాంక్‌కు స్పష్టమైన అవగాహన వస్తుంది. తద్వారా, మోసపూరిత లావాదేవీలను కనిపెట్టడానికి, అరికట్టడానికి వీలవుతుంది.
మరో ఆసక్తికర కథనం: స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి మార్పు!, ఈసారి పెద్ద నిర్ణయం ఉండొచ్చు