న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం తెలిసిందే. తాజాగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు ఢిల్లీలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాంబు ఉందంటూ పోలీసులకు మెయిల్స్ వచ్చాయి. బురారీ ప్రభుత్వ ఆసుపత్రి, మంగోల్‌పురి లోని సంజయ్ గాంధీ ఆసుపత్రులలో బాంబులు అమర్చామంటూ కొందరు అగంతకులు మెయిల్స్ ద్వారా హెచ్చరించారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్ ఎయిర్ పోర్టుకు చేరుకుని తనిఖీలు చేపట్టింది. దాంతో పాటు బాంబు బెదిరింపులు వచ్చిన ఆసుపత్రలుకు కొన్ని టీమ్స్ చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు.
గత వారం న్యూ ఢిల్లీతో పాటుఅహ్మదాబాద్‌లోని స్కూళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం తెలిసిందే. అది బూటకమని తేలింది. మే 1న ఢిల్లీ- ఎన్‌సిఆర్ పరిధిలోని దాదాపు 200 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. స్కూళ్లు మూసివేసి విద్యార్థులను ఇళ్లకు సైతం పంపించివేశారు. అదే విధంగా మే 7 పోలింగ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని 36 స్కూళ్లకు సైతం బాంబు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయని పోలీసులు తెలిపారు.