Rajnath Singh : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజయదశమి సందర్భంగా గురువారం (అక్టోబర్ 2)నాడు మరోసారి పాకిస్తాన్‌ను హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్, భారతదేశ రక్షణ వ్యవస్థను ఛేదించడానికి విఫలయత్నం చేసిందని, మన సైన్యం దీటుగా బదులిచ్చిందని ఆయన అన్నారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసం చేస్తే, దాని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రక్షణ మంత్రి విజయదశమి సందర్భంగా గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భారతీయ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ,''ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ లేహ్ నుంచి సర్ క్రీక్ ప్రాంతం వరకు భారతదేశ రక్షణ వ్యవస్థను ఛేదించడానికి విఫలయత్నం చేసింది, అయితే భారత సైన్యం ప్రతిస్పందనగా పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. భారత సైన్యం ఎప్పుడు, ఎక్కడ, ఎలా అయినా పాకిస్తాన్‌కు భారీ నష్టం కలిగించగలదని ప్రపంచానికి సందేశం ఇచ్చింది.''
సర్ క్రీక్ సమీప ప్రాంతంలో పాక్ మౌలిక సదుపాయాలను పెంచింది
ఆయన మాట్లాడుతూ,''స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ, సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దుపై వివాదం కొనసాగుతోంది. భారతదేశం చాలాసార్లు చర్చల ద్వారా దీనిని పరిష్కరించడానికి ప్రయత్నించింది, కాని పాకిస్తాన్ ఉద్దేశ్యం సరిగ్గా లేదు, దాని ఉద్దేశ్యం స్పష్టంగా లేదు. ఇటీవల పాకిస్తాన్ సైన్యం సర్ క్రీక్ సమీప ప్రాంతాల్లో తన సైనిక మౌలిక సదుపాయాలను ఏ విధంగా పెంచిందో అది దాని ఉద్దేశాన్ని తెలియజేస్తుంది.''
కరాచీకి వెళ్లే మార్గం సర్ క్రీక్ గుండా వెళుతుంది - రక్షణ మంత్రి
"భారత సైన్యం, BSF అప్రమత్తంగా భారత సరిహద్దులను కాపాడుతున్నాయి. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ చేసే ఏదైనా దురాక్రమణకు చరిత్ర, భౌగోళికం రెండింటినీ మార్చే భారీ ప్రతిస్పందన ఉంటుంది. కరాచీకి వెళ్లే ఒక మార్గం ఈ క్రీక్ గుండా వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి" అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.