Daughters Get Equal Coparcenary Rights As Sons: తండ్రి ఆస్తిపై, పూర్వీకుల నుంచి లభించే ఆస్తిపై కుమారుడితో పాటు కూతురికి హక్కులపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు కుమారుడితో పాటు సమాన హక్కు ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముగ్గురు అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల మధ్య తండ్రి ఆస్తుల పంపకాల విషయంపై ఒడిశా హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 


ఒకవేళ హిందూ వారసత్వ సవరణ చట్టం 2005కు ముందే తండ్రి చనిపోయినా కూడా.. కుమారులతో పాటు కూతుళ్లకు సైతం సమానంగా ఆ ఆస్తిలో హక్కు ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. తండ్రి ఆస్తిపై హక్కు, ఆస్తి పంకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి, జస్టిస్ మురారి శ్రీరామన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్వీకుల ఆస్తి, తండ్రి ఆస్తుల్లో కూతురికి కుమారుడితో పాటు సమాన హక్కులు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ఒడిశా హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. సంతానం ఆడ, మగ ఎవరైనా తల్లిదండ్రులకు ఒకటే అని.. కనుక ఆడపిల్లలకు సైతం ఆస్తిని సమానంగా పంచాల్సిన అవసరం ఉందన్నారు. 


సవరణ చట్టంతో సోదరుల లాజిక్.. కోర్టు తీర్పుతో లైన్ క్లియర్.. 
సాధారణంగా కుమారులకు పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో హక్కు లభిస్తుంది. అయితే హిందూ వారసత్వ సవరణ చట్టం 2005తో మార్పులు జరిగాయి. ఆ సవరణలతో కుమారుడితో పాటు కూతురికి సైతం తండ్రి ఆస్తి, పూర్వీకుల ఆస్తిపై సమాన హక్కులు కల్పించారు. ప్రస్తుతం పిటిషన్ వేసిన వ్యక్తి తండ్రి మార్చి 19, 2005న చనిపోయారు. అయితే హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 అదే ఏడాది సెప్టెంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం సవరించక ముందే, తండ్రి చనిపోయారని.. కునక తండ్రి మరణానంతరం ఆస్తి మొత్తం తమకే దక్కుతుందని కుమారులు చెబుతున్నారు. 
వారసత్వ సవరణ చట్టం అమల్లో ఉన్నందున తండ్రి ఆస్తిలో సోదరులతో పాటు తమకు సమాన హక్కు ఉందని ముగ్గురు సోదరీమణులు సబ్‌కలెక్టర్‌ ఎదుట సవాల్ చేశారు. దాంతో తండ్రి ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా లభించింది. కానీ సోదరులు ఈ నిర్ణయాన్ని కమిషన్‌లో సవాలు చేశారు. చివరగా ఈ కేసు ఒడిశా హైకోర్టుకు వచ్చింది. తాజాగా విచారించిన ధర్మాసనం కూమారులతో పాటు కూతురికి తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉందని తేల్చింది.


చట్టం ఏం చెబుతోంది?
ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కుమారుడికి హక్కు లభిస్తుంది. కానీ  నాల్గవ తరం వరకు మగ సంతానం ఆస్తికి వారసులు అవుతారు. గతంలో కుమార్తెకు ఆస్తిలో హక్కు ఉండేది కాదు. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో హిందూ వారసత్వ చట్టం 1956 కు సెక్షన్ 6-ఎని చేర్చారు. కుమార్తెకు సైతం కుమారుడితో పాటు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ తరువాత 2005లో హిందూ వారసత్వ సవరణ చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కనుక కుమార్తెకు తప్పకుండా తండ్రి ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలని ధర్మాసనాలు స్పష్టం చేశాయి. కేరళ హైకోర్టు ఇదివరకే పలు కేసుల్లో ఇలాంటి తీర్పు వెలువరించింది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial