Darbhanga Express Fire Accident: న్యూఢిల్లీ: దేశంలో మరో రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ- దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు (02570)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని ఇటావా సమీపంలో బుధవారం రాత్రి ఎక్స్ ప్రెస్ రైలులో కొన్ని బోగీలలో మంటలు చెలరేగాయి. దర్భంగా క్లోన్ స్పెషల్ (02570) యూపీలోని సరాయ్ భోపట్ రైల్వే స్టేషన్ నుంచి వెళుతుండగా ఒక్కసారిగా ఎస్1 కోచ్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బోగీలో మంటలు రావడంతో అప్రమత్తమైన స్టేషన్‌ మాస్టర్‌ రైలును నిలిపివేశారు. ఆ తరువాత ప్రయాణికులు రైలు దిగిపోయారు. కొన్ని బోగీలలో ఉన్న వారికి అసలు ఏం జరిగింది, రైలు ఎందుకు ఆగిందో మొదట అర్థంకాలేదు. రైలు దిగిన వెంటనే వేరే బోగీలలో మంటలు చెలరేగినట్లు తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు.


ఎక్స్ ప్రెస్ రైలులోని ఒక స్లీపర్ కోచ్‌ (ఎస్1)లో మొదటగా మంటలు చెలరేగాయి, అయితే వెంటనే మరో మూడు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. అయితే ఒక్క కోచ్ లో అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులు వేగంగా కిందకి దిగిపోవడంతో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కావడం, ప్రాణనష్టం జరగలేదు అని ఉత్తర మధ్య రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు. కొంత సమయం తరువాత ఆ రైలు తిరిగి బయలుదేరుతుంది అని తెలిపారు.


రైలులో ప్రయాణిస్తున్న కొందరు ఈ ఘటనపై స్పందించారు. బోగీలు మంటలు చెలరేగగా అతికష్టం మీద మేం అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పారు. మంటలను ఆర్పడానికి రైలులో ఎలాంటి పరికరాలు, సాధనాలు లేవని తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవాలని బయటపడే ప్రయత్నంలో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని పీటీఓ రిపోర్ట్ చేసింది. 






రైలు అగ్నిప్రమాదానికి గురైన ఈ ఘటనలో కొంతమంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయని ఎస్ఎస్పీ సంజయ్ కుమార్ వర్మ పీటీఐకి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్ ప్రమాదం జరిగిన చోటుకు బయలుదేరారు. అయితే దాదాపు 3 రైలు కోచ్ లు మంటలు చెలరేగి దగ్దమైనట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ ఈ ఘటనపై విచారణ చేపట్టనుంది. ఇది మానవ తప్పిదమా, లేక టెక్నికల్ ప్రాబ్లంతో ప్రమాదం జరిగిందా అనేదానిపై స్పష్టతరాలేదు.