Srinagar News: శ్రీనగర్‌లోని దాల్‌లేక్‌లో షికారాల్లో తిరుగుతూ న్యూ ఇయర్‌కు స్వాగతం పలకడం చాలా మంది పర్యాటకులకు ఒక డ్రీమ్. ఈ ఏడాది టూరిస్టులకి అది తీరని కల అయిపోయింది. శ్రీనగర్‌లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు మైనస్ 7 డిగ్రీలకు పడిపోయాయి. దాల్ లేక్‌ మొత్తం ఐస్‌తో గడ్డ కట్టేసింది. దానితో షికారాలుగా పిలిచే బోట్లు లేక్ ఒడ్డునే నిలిచిపోయాయి.


దాల్ లేక్‌లో షికారాల్లో తిరగడం ఒక మరుపురాని అనుభూతి 
"శ్రీనగర్ కిరీటంలో వజ్రం"గా చెప్పుకునే దాల్ లేక్ పురాతన భారతీయ గ్రంథాల్లో "మహాసరిత్" పేరుతో దాల్ లేక్ చరిత్ర ఉంది. అయితే దీనిని ఒక టూరిస్ట్ స్పాట్‌గా మొగల్ చక్రవర్తుల కాలంలో డెవలప్ చేశారు. మధ్యలో కొంతకాలం అలజడుల కారణంగా పర్యాటకం దెబ్బతిన్నా గత కొన్నేళ్లుగా పరిస్థితులు చక్కబడ్డంతో మళ్లీ శ్రీనగర్‌కు పర్యటకులు పోటెత్తుతున్నారు.18 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ మహా సరస్సులో షికారాలు అని పిలిచే చిన్న చిన్న పడవల్లో తిరగడం చాలామంది టూరిస్టులకు ఒక డ్రీమ్. 




సరసు మధ్యలో చూడవలసిన ఆరు పాయింట్లు ఉన్నాయి. వీటిలో గంటలో నాలుగు చూపించడానికి షికారాకు 1500 -2500 తీసుకుంటారు. మొత్తం ఆరు పాయింట్లు కవర్ చేయడానికి రెండున్నర గంటల టైం పడుతోంది. దీనికి మూడు నుంచి నాలుగు వేలు తీసుకుంటారు షికారా యజమానులు. సరస్సు మధ్యలోనే షాపింగ్ పాయింట్స్ ఉంటాయి. ఫ్లోటింగ్ గార్డెన్స్ ఉంటాయి. రకరకాల రెస్టారెంట్స్ ఉంటాయి. అయితే ప్రస్తుతం అవన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. 


దాల్‌ లేక్‌లో తిరిగే దాదాపు 7వేల షికారాల్లో చాలావరకూ ఒడ్డునే ఉండిపోయాయి. దీనికి కారణం అక్కడ విపరీతంగా కురుస్తున్న మంచు. సాధారణంగా గుల్ మార్గ్ ప్రాంతాల్లో ఈటైమ్‌లో మంచు గడ్డ కట్టేస్తూ ఉంటుంది. కానీ ఈసారి శ్రీనగర్‌లోనే మంచు విపరీతంగా కురియడంతో టూరిస్టులు లేక దాల్ లేక్ చుట్టూ పర్యటకం ఆల్మోస్ట్ స్తంభించిపోయింది. 


 బెస్ట్ సీజన్ ఎప్పుడంటే 
దాల్ లేక్ అందాలు చూడాలంటే బెస్ట్ సీజన్ మార్చి నుంచి ఆగష్టు ఎండ్ వరకూ అన్నారు ఒక షికారా బోటు యజమాని ఖాదర్. అ సమయంలో అయితే లేక్ మధ్యలో ఉండే లోటస్ గార్డెన్ పూర్తిగా వికసించి ఉంటుందని రకరకాల పక్షులను కూడా చూడొచ్చు అనీ అన్నారు. శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ సహా ఇతర ఉద్యానవనాల అందాలను చూడ్డానికి అది బెస్ట్ టైమ్ అనీ కాబట్టి ఆ టైంలో శ్రీనగర్‌కి విజిట్ కోసం ప్లాన్ చేసుకుంటే మంచిది అని అక్కడి టూరిస్ట్ గైడ్ లు చెబుతున్నారు.