Cyclone Biparjoy Effect: 


ముంచుకొస్తున్న ముప్పు..
  
బిపర్‌జాయ్ తుపాను (Cyclone Biparjoy) ముంచుకొస్తోంది. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాలకు తీవ్ర తాకిడి ఉంటుందని IMD హెచ్చరించింది. బలమైన గాలులతో తుపాను ముంచుకొస్తుందని వెల్లడించింది. ఫలితంగా...గుజరాత్ ప్రభుత్వం NDRF బృందాలను సిద్ధం చేసింది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. (రేపు) జూన్ 15 సాయంత్రం నాటికి ఈ ప్రభావం తీవ్రతరమవుతుందని అధికారులు వెల్లడించారు. బలమైన గాలుల కారణంగా చెట్లు కూలిపోయి ఇళ్లపైన పడే ప్రమాదముందని తెలిపారు. అంతే కాదు. భారీ వస్తువులు ఏవైనా గాల్లో ఎగిరొచ్చి తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చే అవకాశముందని IMD అంచనా వేసింది. గుజరాత్‌లో ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారులను హెచ్చరించారు. కొద్ది రోజుల వరకూ చేపలు పట్టేందుకు వెళ్లకూడదని తేల్చి చెప్పారు. తీరప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్, దేవభూమి ద్వారకా, పోర్‌బందర్, జామ్‌నగర్, రాజ్‌కోట్, జునాగర్, మోర్బి జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు. రైల్వేలోని ఓవర్ హెడ్‌ లైన్స్‌ కూడా భారీగానే డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. సిగ్నలింగ్ సిస్టమ్‌పైనా ప్రభావం పడనుంది. అయితే...ఈ ప్రభావం కేవలం గుజరాత్‌కే పరిమితం అయ్యేలా లేదు. మరి కొన్ని రాష్ట్రాలపైనా ఇది ప్రభావం చూపిస్తుందని IMD అంచనా వేస్తోంది. 


ఈ రాష్ట్రాల్లోనూ..


వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం...గుజరాత్‌తో పాటు రాజస్థాన్‌లోనూ బిపర్‌జాయ్ ప్రభావం కనిపించనుంది. ఈ రాష్ట్రంలోని జోధ్‌పూర్, ఉదయ్‌పూర్‌ డివిజన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. జూన్ 16వ తేదీన నైరుతి రాజస్థాన్‌లో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. జూన్ 17న భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉదయ్‌పూర్‌తో పాటు అజ్మేర్‌లోనూ ఈ ఎఫెక్ట్ పడనుంది. మధ్యప్రదేశ్‌లోనూ షాహ్‌దోల్, జబల్‌పూర్, భోపాల్, నర్మదాపురం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఖ్వాండా, ఖార్గోనే, బర్వాని, బుర్హన్‌పూర్‌లో రానున్న 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ధార్, బలాఘట్, రత్లాం జిల్లాలో వేడి గాలులు వీచే అవకాశముంది. గోవాపైనా ఈ తుపాన్ ఇంపాక్ట్ పడనుంది. ఇప్పటికే ఇక్కడ తుపాను ప్రభావం కనిపిస్తోంది. సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. ఈ కారణంగా...టూరిస్ట్‌లు ఎవరూ బీచ్‌లకు వెళ్లకుండా అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కొంత మేర ఈ తుపాను ప్రభావం పడే అవకాశముంది. బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. 


 అలాగే లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా తుపాను ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. జూన్ 15 నాటికి బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరంలో అడుగు పెడుతుందని అంచనా. పశ్చిమ తీరంలోని ముంబై నుంచి కచ్ వరకు సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు, తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. గుజరాత్ లో తుపానుకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 


Also Read: Biparjoy Cyclone Wind Speed: 150 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తున్న బిపర్జోయ్ తుపాన్, ప్రభావం ఎంతంటే?