Cyclone Biparjoy: 


940 గ్రామాలు చీకట్లోనే..


బిపార్‌జాయ్ తుపాను ప్రభావం గుజరాత్‌లో తీవ్రంగానే కనిపిస్తోంది. ఊహించినట్టుగానే నష్టం వాటిల్లుతోంది. కొండ చరియలు విరిగి పడటం సహా తుపాను ధాటికి పెద్ద పెద్ద కరెంట్ పోల్స్ కూడా కుప్ప కూలిపోతున్నాయి. కచ్‌తో పాటు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకూ కనీసం 300 కరెంట్ పోల్స్ నేలకొరిగినట్టు సమాచారం. ఇక చెట్లు కూడా విరిగిపోయి ఇళ్లపై  పడుతున్నాయి. మరి కొన్ని రహదారులపై కూలుతున్నాయి. బలమైన గాలుల వీస్తుండడం వల్ల వందలాది చెట్లు నేలకొరిగాయి. తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో విద్యుత్‌కి అంతరాయం కలుగుతోంది. దాదాపు 940 గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కచ్‌లోని మాండ్వి, మోర్బిలోని మలియా ప్రాంతాల్లో చెట్లన్నీ కూలిపోతున్నాయి. కరెంట్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 






"బలమైన గాలులు వీస్తుండటం వల్ల కరెంట్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. మలియాలో దాదాపు 45 గ్రామాలకు విద్యుత్ సరఫరా కట్ అయిపోయింది. 9 గ్రామాల్లో విద్యుత్‌ని రీస్టోర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మిగతా చోట్ల కూడా వీలైనంత త్వరగా విద్యత్ సరఫరాను పునరుద్ధరిస్తాం. గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. 200 కరెంట్ స్తంభాలు,250 చెట్లు కూలిపోయాయి. ఇక్కడి ప్రజల్ని షెల్టర్ హోమ్స్‌కి తరలించాం. దాదాపు 52 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాం. 25వేల పశువులనూ తరలించాం"


- అధికారులు






మలియా తాలూకాలోని మోర్బిలో రెండు పవర్ స్టేషన్‌లు ధ్వంసమైనట్టు అధికారులు వెల్లడించారు. ఆ రెండింటినీ మూసేశారు. చెట్లు కూలడం వల్ల చాలా వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. పలు వాహనాలు ధ్వంసమవుతున్నాయి.