Corona Cases India: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ దాదాపు తగ్గిపోయింది. ఓ దశలో 3 లక్షలకు పైగా నమోదైన కరోనా కేసులు నేడు కేవలం 5 వేల లోపు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,503 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 27 మంది కొవిడ్ 19తో పోరాడుతూ చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది.
పాజిటివ్ కంటే రికవరీలు అధికం..
ఆదివారం ఒక్కరోజులో పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు అధికంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజు 4,377 మంది కరోనా మహమ్మారిని జయించారు. దీంతో దేశంలో కరోనా రికవరీల సంఖ్య 4 కోట్ల 24 లక్షల 41 వేల 449కి చేరింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 36,168 (Active Corona Cases In India) ఉన్నాయి. మొత్తం కేసులలో ఇది 0.08 శాతం అని రోజువారీ రికవరీ రేటు సైతం 0.47 శాతానికి దిగొచ్చినట్లు కేంద్ర వైద్యశాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకూ కరోనాతో 5 లక్షల 15 వేల 877 మంది చనిపోయారు.
దేశంలో ఇప్పటివరకూ 1,79,91,57,486 (179 కోట్ల 91 లక్షల 57 వేల 4 వందల 86) డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా డోసుల నిల్వ ఉన్నట్లు సమాచారం. కర్ణాటకలో గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. జూన్ 5, 2020 తరువాత ఒక్కరోజులో కనీసం ఒక్క మరణం కూడా నమోదు అవకపోవడం ఇది తొలిసారి అని కేంద్ర వైద్యశాఖ తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 45.69 కోట్లకు చేరుకుంది. మరోవైపు కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకూ 60 లక్షలకు పైగా మరణించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా 10.68 బిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగినట్లు ప్రముఖ జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: గుండె పోటు బారిన పడకుండా ఉండాలా? వైద్యులు చెబుతున్న అయిదు మార్గాలు ఇవిగో