PM Modi on Coromandel Express Accident: ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత మంది చనిపోవడం కలచివేసిందన్నారు. బాలాసోర్ మెడికల్ కాలేజీకి వెళ్లిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందుకున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తాం, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం అన్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రైలు పట్టాలను మరమ్మతులు చేపట్టి, రైలు సర్వీసులను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని రైల్వే శాఖ ప్రయత్నిస్తోందన్నారు. రైలు ప్రమాదంలో గాయపడ్డ వారిని, బాధితులను కలిశాను.. ప్రమాదంపై మాట్లాడేందుకు తనకు నోట మాట రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.
పలు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఈ ఘటనలో చనిపోయారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కానీ ఈ ఘటన ఎంతగానో కలచివేసింది. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం పోయిన ప్రాణాల్ని తీసుకురాలేం. ఈ ప్రమాదానికి బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం అన్నారు ప్రధాని మోదీ. ఒడిశా ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు వైద్య చికిత్స అందించింది. కొందరు రాత్రివేళ కూడా రక్తదానం చేసేందుకు హాస్పిటల్ కు వచ్చారు. రైల్వే శాఖ రైల్వే లైన్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తుందన్నారు.
అంతకుముందు బాలాసోర్ లో రైలు ప్రమాదం జరిగిన స్థలానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రాథమిక రిపోర్టును ప్రధానికి వివరిస్తున్నారు. అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న కటక్‌లోని ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొని మృతి చెందిన ఘటనా స్థలాన్ని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శనివారం సందర్శించారు.
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 261కి పెరిగింది. మరో 900 మంది వరకు గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు.
Also Read: Odisha Train Accident: కలిచి వేస్తున్న ఒడిశా రైలు ప్రమాద దృశ్యాలు, చెల్లాచెదురైన బోగీలు - వైరల్ వీడియో