Jammu & Kashmir:
ఉగ్రదాడిలో గాయపడ్డ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు స్తబ్దుగానే అనిపించినా..ఈ మధ్య కాలంలో మళ్లీ ఉగ్ర అలజడి మొదలైంది. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో బిజ్బేహారా ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన దాడిలో పోలీస్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. కశ్మీర్ జోన్ పోలీస్‌లు వెల్లడించిన వివరాల ప్రకారం..ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు మోహరించారు. సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. రజౌరి జిల్లాలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి ఘటన మర్చిపోకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. రజౌరిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు భారత సైనికులు మృతి చెందారు. "ఫిదాయే" గ్రూప్‌నకు చెందిన ఉగ్రవాదులు ఇలా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతుంటారు. మూడేళ్లుగా వీరి కదలికలు లేవు. ఉన్నట్టుండి జరిగిన ఈ దాడితో..మరోసారి వాళ్లు జమ్ముకశ్మీర్‌లో అడుగు పెట్టారని స్పష్టమైంది. రక్షణశాఖ ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్..ఓ కీలక విషయం వెల్లడించారు. జమ్ముకి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న రజౌరి జిల్లాలోని పర్ఘల్ పోస్ట్ వద్ద కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని చెప్పారు. అక్కడి ప్రతికూల వాతావరణాన్ని ఆసరాగా తీసుకుని క్యాంప్‌పై దాడి చేసేందుకు కుట్ర పన్నారని తెలిపారు. గ్రనేడ్లతో తిరుగుతున్న ఆ అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
అప్పటి దాడులను గుర్తు చేస్తూ..
అంతకుముందు, రాజౌరీలో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ కంపెనీ ఆపరేటింగ్ బేస్‌పై ఉగ్రవాదులు ,ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు, దీనికి భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. ఉగ్రవాదులపై ఈ ఆపరేషన్ పూర్తయిందని భారత సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన , ఆపరేషన్‌లో భారత సైన్యానికి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందగా, ఐదుగురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆగస్టు 11న రజౌరిలో జరిగిన ఉగ్రదాడి ఉరీ దాడిని గుర్తుచేసేలా ఉంది. 18 సెప్టెంబర్ 2016న, జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాదులు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ సమీపంలోని భారత సైన్యం స్థానిక ప్రధాన కార్యాలయంలోకి చొరబడి, శిబిరంలో నిద్రిస్తున్న భారత సైనికులపై దాడి చేశారు. నిద్రిస్తున్న భారత సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 17 హ్యాండ్ గ్రెనేడ్లను కూడా ప్రయోగించారు. ఈ ఉగ్రదాడిలో 16 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆరు గంటల పాటు జరిగిన ఎన్ కౌంటర్‌లో భారత ఆర్మీ జవాన్లు నలుగురు జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాదులను హతమార్చారు. 10 రోజుల తర్వాత భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.
Also Read: GST Rule On House Rent: అలర్ట్ - ఇంటి అద్దెపై 18% జీఎస్‌టీ! కేంద్రం ఏం చెబుతోందంటే?
Also Read: Independence Day 2022: ఆగస్టు 15, జనవరి 26న జెండా ఆవిష్కరణలో ఇంత తేడా ఉందా!