Continues below advertisement

Rahul Gandhi Press Meet: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీపై ఓట్ల చోరీ అంశంపై విమర్శలు గుప్పించారు. గురువారం (సెప్టెంబర్ 18)న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ మాట్లాడుతూ, ఓట్ల చోరీ గురించి తాను ఏది చెప్పినా చాలా బాధ్యతతో చెబుతున్నానని అన్నారు. దీనికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఓటర్ల జాబితా నుంచి చాలా మంది పేర్లను తొలగించారని ఆయన ఆరోపించారు.

రాహుల్ మాట్లాడుతూ, "ముందుగా ఇది హైడ్రోజన్ బాంబ్ కాదు, హైడ్రోజన్ బాంబ్ రాబోతోంది. ఎన్నికల్లో ఎలా మోసాలు జరుగుతున్నాయో ఈ దేశంలోని యువతకు చూపించడానికి, వివరించడానికి ఇది ఒక మైలురాయి" అని అన్నారు.

ఆయన మాట్లాడుతూ, "కర్ణాటకలోని అలంద్ ఒక నియోజకవర్గం. ఎవరో 6018 ఓట్లను తొలగించడానికి ప్రయత్నించారు. 2023 ఎన్నికల్లో అలంద్‌లో మొత్తం ఎన్ని ఓట్లు తొలగించారో మాకు తెలియదు. ఈ సంఖ్య 6018 కంటే చాలా ఎక్కువ, కానీ 6018 ఓట్లను తొలగిస్తూ ఒకరు చిక్కారు, ఇది యాదృచ్ఛికంగా జరిగింది. అక్కడ బూత్ స్థాయి అధికారి తన మామ ఓటు తొలగించారని చూసి, తన మామ ఓటును ఎవరు తొలగించారో విచారించగా, ఓటు తొలగించిన వ్యక్తి తన పొరుగువాడని తేలింది. అతను తన పొరుగువారిని అడగ్గా, నేను అలా చేయలేదని చెప్పారు. ఓటు తొలగించిన వ్యక్తికి కానీ, ఎవరి ఓటు తీసేశారో వారికి కానీ దీని గురించి తెలియదు. మరెవరో ఈ ప్రక్రియను హైజాక్ చేసి ఓటును తొలగించారు."

రాహుల్ గాంధీ కర్ణాటకకు చెందిన కొంతమంది వ్యక్తుల ఉదాహరణ ఇచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన కొంతమందిని వేదికపైకి పిలిచారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి మాట్లాడుతూ, మొత్తం 12 మంది పేర్లను తొలగించారని చెప్పారు. నేను పేర్లను తొలగించమని ఎవరినీ అడగలేదు. రిక్వస్ట్‌ పెట్టుకోలేదు." అని తెలిపారు. రాహుల్ మాట్లాడుతూ, ''నాగరాజ్ అనే వ్యక్తి రెండు ఫారమ్‌లను నింపారు, రెండూ 36 సెకన్లలో నింపేశారు. ఫారమ్‌లను నింపడానికి వేరే రాష్ట్రం నుంచి ఫోన్ తీసుకువచ్చారు. ఆ ఫోన్ ద్వారానే ఈ ఫారమ్‌లను నింపారు." అని వివరించారు. 

'ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడానికి చాలా మొబైల్ ఫోన్‌లను ఉపయోగించారు’

"అలంద్‌లో ఓటర్ల పేర్లతో 6018 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. ఈ దరఖాస్తులను దాఖలు చేసిన వ్యక్తులకు వాటి గురించే తెలియదు. వారెప్పుడు కూడా దరఖాస్తు చేయలేదు. ఈ దరఖాస్తులు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆటోమేటిక్‌గా దాఖలు అయ్యేలా చేశారు. ఓటర్ల పేర్లను తొలగించడానికి అనేక రాష్ట్రాల మొబైల్ నంబర్‌లను ఉపయోగించారు" అని రాహుల్ అన్నారు.

ఎన్నికల కమిషన్ చీఫ్‌పై రాహుల్ తీవ్రమైన ఆరోపణలు 

"భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓటు దొంగలను రక్షిస్తున్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిని ఆయన రక్షిస్తున్నారు. చిన్న తప్పు జరిగినా దొంగతనం నేరం రుజువు అవుతుంది. " అని రాహుల్ గాంధీ అన్నారు.