కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌, సీనియర్ నేత డీకే శివకుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను డేగ ఢీ కొట్టింది. దీంతో హెలికాప్టర్‌ను అకస్మాత్తుగా కిందికి దించేశారు. 


డేగ ఢీ కొట్టడంతో హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న టైంలోనే ఈ దుర్గటన జరిగింది. ఈ ప్రమాదంలో డీకే శివకుమార్‌కు ఏమీ కాలేదు. ఆయనతో ఉన్న కెమెరామెన్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ డీకే వివిధ ప్రాంతాల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ములబగిలులో ప్రచారం కోసం బయల్దేరి వెళ్లారు. తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ హోసోకట్‌ వద్దకు చేరుకోగానే ప్రమాదం జరిగింది. 






హెలికాప్టర్‌ను డేగ ఢీ కొట్టిన వెంటనే పైలెట్‌ అప్రమత్తమయ్యాడు. వెంటనే సురక్షితంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశారు. అయినా కెమెరామెన్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంతకు మించీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.