Congress On Adani : అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై ఆర్బీఐ, సెబీ దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో స్టాక్‌ మార్కెట్లతో పాటు రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై  ఆర్బీఐ, సెబీతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేసింది.  అదానీ గ్రూప్, బీజేపీ ప్రభుత్వానికి మధ్య సన్నిహిత సంబంధాలు గురించి పూర్తిగా అర్థం చేసుకోగలమని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. తప్పుడు పద్ధతిలో వ్యాపారం చేసే వాటిపై హిండెన్‌బర్గ్‌ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికను పక్కనపెట్టగలమా? అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. సాధారణంగా రాజకీయ పార్టీలు వ్యక్తిగత కంపెనీ లేదా వ్యాపార సంస్థలపై పరిశోధన నివేదికపై స్పందించవని, అయితే అదానీ గ్రూప్‌ పై హిండెన్‌బర్గ్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ సమగ్ర దర్యాప్తు డిమాండ్ చేస్తుందని జైరాం రమేశ్ అన్నారు. మోదీ సీఎంగా ఉన్నప్పటి నుంచీ అదానీ గ్రూప్ ఆయనతో సన్నిహితంగా ఉందని గుర్తించామన్నారు. 


 అంతేకాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అదానీ గ్రూప్‌కు ఆర్థిక సాయం అందించిందని కాంగ్రెస్ తెలిపారు. కోట్లాది మంది భారతీయులు ఎల్ఐసీ, ఎస్బీఐ సంస్థల్లో పొదుపుచేసుకున్నారని, అదానీ సంస్థకు ఈ రెండు ఆర్థిక ఊతం అందించడంతో సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని అందుకే కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించిందన్నారు.  హిండెన్ బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్‌ను అతి పరపతిగా వర్ణించాయని జైరాం రమేశ్ అన్నారు. ఈ ఆరోపణలు భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం భద్రతకు ముడిపడి ఉందని, దీనిపై  తీవ్రమైన విచారణ అవసరమన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) , సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సంస్థలతో ఈ ఆరోపణలపై విచారణ చేపట్టాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. 


హిండెన్ బర్గ్ పై చట్టపర చర్యలు 


అమెరికన్‌ షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. తమ కంపెనీ అకౌంటింగ్‌ ప్రమాణాల్లో లోపాలు, అవకతవకలు ఉన్నాయంటూ ఇచ్చిన నివేదిక అవాస్తవమని వెల్లడించింది. అమెరికా, భారత చట్టాలను అనుసరించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బుధవారం ఒక్కరోజే అదానీ గ్రూప్‌ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు రూ.లక్ష కోట్ల మేర నష్టపోయిన సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక లోపభూయిష్ఠంగా ఉందని ఆ సంస్థ తెలిపింది. ఈ నివేదిక అనుమానాస్పదంగా ఉందని, ఎలాంటి పరిశోధన చేయలేదని అదానీ గ్రూప్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒక విదేశీ సంస్థ దురుద్దేశ పూర్వకంగా ఇన్వెస్టర్ల కమ్యూనిటీ, సాధారణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించిందని వెల్లడించారు. కంపెనీ గుడ్‌విల్‌, పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందన్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవోను దెబ్బకొట్టాలన్న ఉద్దేశం కనిపిస్తోందన్నారు. 


షేర్ల విలువ తగ్గించేలా చేసేందుకే 


'భారత స్టాక్‌ మార్కెట్లను తీవ్ర ఒడుదొడుకులకు గురి చేసిన హిండెన్‌బర్గ్‌ నివేదికను తీవ్రంగా పరిగణించాలి. ఇది భారత పౌరుల్లో అనవసర ఆందోళనలను సృష్టించింది' అని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. అదానీ షేర్ల పతనం నుంచి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్టు స్వయంగా ఆ కంపెనీయే అంగీకరించిందని వెల్లడించింది. ఈ ఉద్దేశంతోనే కంపెనీ షేర్ల విలువను తగ్గించేలా నివేదిక రూపొందించారని స్పష్టం చేసింది. శుక్రవారం మొదలయ్యే ఎఫ్‌ఈవోకు నష్టం కలిగించేందుకే ఇలా చేశారని తెలిపింది.