ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను అధినేత్రి సోనియా గాంధీకి అందజేసింది. ఈ నివేదికపై దిల్లీ 10 జన్‌పథ్‌లో కమిటీ సభ్యులతో సోనియా గాంధీ చర్చిస్తున్నారు. పీకే చేరికపై తుది నిర్ణయాన్ని పార్టీ వెల్లడించే అవకాశం ఉంది.


కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, రణ్‌దీప్ సుర్జేవాలా, జైరాం రమేశ్, ప్రియాంక గాంధీ సహా 8 మంది సభ్యులున్న ఈ కమిటీ.. కిశోర్ ఇచ్చిన వ్యూహాత్మక ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించింది. 2024 ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేయడంపై పీకే సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం వీరంతా సోనియా గాంధీతో ఈ అంశంపై చర్చిస్తున్నారు.


ఏ బాధ్యతలు


ప్రశాంత్ కిశోర్ చేరికపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపేందుకు పీకే అవసరమని అధిష్టానం భావిస్తోంది. ఆయన పార్టీలో చేరితే అప్పగించాల్సిన బాధ్యతలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే పీకే చేరిక, పీకే ఎన్నికల వ్యూహాలపై సోనియా ఓ కమిటీ వేశారు. ఇప్పటికే ఆ కమిటీ సభ్యులు నివేదిక అందజేశారు.


ఆయన పార్టీలో చేరితే ఇతర పార్టీలకు వ్యూహకర్తంగా పీకే పని చేయకూడదనే నిబంధన ఈ కమిటీ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై పీకే చేసిన సూచనలను రాహుల్, ప్రియాంక గాంధీలు స్వాగతించారు.


ఆయన వైపే


ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కుదేలైన పార్టీని బతికించుకునేందుకు కొత్త వ్యూహకర్త కావాలని భావించి ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానించింది. ఆయన కూడా వెంటిలేటర్‌ మీద ఉన్న హస్తం పార్టీకి ప్రాణం నింపే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. అధినాయకత్వంతో నాలుగైదు సార్లు భేటీ అయ్యారు. 


తన వ్యూహాలకు పదునుపెట్టి మిషన్‌ 400 అంటూ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఇదంతా గమనించిన హస్తం హైకమాండ్‌ పీకేను తమ నేతగా మార్చుకునేందుకు ఒప్పించింది.


కొంతకాలంగా జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రశాంత్‌ కిశోర్‌ ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానంటూ ఆ పార్టీ హైకమాండ్‌ను సంప్రదించారు. సోనియాగాంధీ, రాహుల్‌తోనూ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ అనుసరించాల్సిన విధానంపై ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. మరి పీకే కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతారు? చేరితే ఆయనకే ఏ పదవి ఇస్తారనేది చూడాలి.


Also Read: NEET MDS 2022 Admit Card: మెడికల్ స్టూడెంట్స్‌కు అలర్ట్ - నీట్ ఎండీఎస్ 2022 అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి


Also Read: Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ విజయం - వరుసగా రెండోసారి