ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి సలహాలు ఇచ్చేందుకు పార్టీలో చేరేందుకు పీకే ఇప్పటికే అంగీకరించారు. దీనిపై కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోనుంది.
ప్రశాంత్ ఎపిసోడ్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. ఓవైపు టీఆర్‌ఎస్ పార్టీకి సలహాలు ఇస్తామంటున్న ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో కాకపుట్టిస్తున్నాయి.
ప్రశాంత్ కిషోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశంపై ఏఐసీసీలో తీవ్ర మథనం జరుగుతోంది. దీనిపై అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకోనున్నారు. ఇటు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే... మరోవైపు ఇతర పార్టీలకు సలహాలు ఇచ్చేందుకు కూడా ఒప్పందాలు చేసుకోవడంపై శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ టీఆర్‌ఎస్ కోసం పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్... కాంగ్రెస్‌ను బలహీన పరిచే వ్యూహాలు రచిస్తున్నారని మండిపడుతున్నారు ఇక్కడి కాంగ్రెస్ నేతలు. దీనిపై ఎలా మాట్లాడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి నేతలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నారు. రాహుల్ గాంధీతో పర్యటనలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ పనిచేయడమే కాకుండా ఆయన కాంగ్రెస్ చేరితే తమను ఇరకాటంలో పడేసినట్టు అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా మాట్లాడకపోయినా లోలోప మధన పడుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మాత్రం పరోక్షంగా పీకే తీరును తప్పుపడుతూ ట్వీట్‌లు చేయడం సంచలనంగా మారింది. నీ శత్రువుతో స్నేహంగా ఉండే వ్యక్తులను నమొద్దనే కొటేషన్‌ను మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. దీంతోపాటు మహాత్మ గాంధీజీ కొటేషన్ కూడా జోడించారు. చిట్టచివరి అవకాశాన్ని, ఆశను వదులుకోనంటూ ట్వీట్ చేయడం కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారి తీసింది.
ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్‌పై ఎవరూ బహిరంగా వ్యాఖ్యలు చేయొద్దని అధిష్ఠానం సూచించినట్టు తెలుస్తోంది. సమస్యలు ఉంటే తామే పరిష్కరిస్తామని అంటున్నారు. ఇవాళ జరిగే ఏఐసీసీ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ చేరికపై తేల్చేయనున్నారు.