Rahul Gandhi:
ఓసీసీఆర్ రిపోర్ట్...
అదానీ గ్రూప్‌పై OCCR ఇచ్చిన రిపోర్ట్‌ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నివేదిక దేశ ప్రతిష్ఠని దిగజార్చిందని మండి పడ్డారు. వందల కోట్ల డాలర్లు భారత్ నుంచి వెళ్లిపోయాయని, అవి మళ్లీ తిరిగి షెల్ పెట్టుబడుల్లాగా వచ్చాయని అన్నారు. ఈ డబ్బు ఎవరిది అనేది తేలాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో గౌతమ్ అదానీ పాత్ర ఏంటో తెలియాల్సి ఉందని అన్నారు. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఈ మొత్తం స్కామ్‌కి మాస్టర్ మైండ్ అని ఆరోపించారు రాహుల్ గాంధీ. అదానీ గ్రూప్ షేర్‌ల విలువ పెంచేందుకే ఇలా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.
"ప్రస్తుతం ఇండియా G20 సమ్మిట్‌కి సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే భారత్ స్థానం ఏంటో ఇది నిరూపించనుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంతో పారదర్శకంగా ఉండాల్సిన అవసరముంది. కానీ ఇవాళ రెండు అంతర్జాతీయ న్యూస్ పేపర్స్ ఇండియాలోని ఇన్వెస్ట్‌మెంట్‌లపై ఎన్నో ప్రశ్నలు సంధించాయి. అదానీ గ్రూప్‌పై OCCR రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇప్పటికే చాలా నివేదికలు దీని గురించి ప్రస్తావించాయి. ఇవన్నీ మన దేశ ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయి. ఈ డబ్బంతా ఎవరిది..? అదానీది మాత్రమేనా..? ఇంకెవరి హస్తమైనా ఉందా..? గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఈ వ్యవహారం వెనక మాస్టర్ మైండ్. మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ స్కామ్‌లో ఉన్నారు. ఒకరు నజీర్ అలీ షబన్, మరొకరు చాంగ్ చుంగ్ లింగ్. ఇండియాలో కంపెనీలపై వీళ్ల పెత్తనం ఏంటి.."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు..?
సెబీకి అన్ని ఆధారాలూ సమర్పించినా క్లీన్ చిట్ ఇవ్వడం వెనక ఏదో కుట్ర జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఈ స్కామ్‌ని విచారించిన వ్యక్తే అదానీ గ్రూప్ ఉద్యోగిగా మారిపోయాడని, అలాంటప్పుడు ఇన్వెస్టిగేషన్‌పై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. అసలు ఎలాంటి విచారణ జరగలేదని చాలా స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు.
"అదానీ వ్యవహారంలో సెబీకి అన్ని ఆధారాలు ఇచ్చారు. కానీ గౌతమ్ అదానీకి సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చి చెప్పింది. దురదృష్టం ఏంటంటే...విచారణ చేపట్టిన వ్యక్తే ఇప్పుడు అదానీ గ్రూప్ ఉద్యోగిగా మారిపోయారు. అలాంటప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్‌ని ఎలా నమ్మేది..? అసలు ఎలాంటి విచారణ జరగలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే దీనిపై ఇన్విస్టిగేషన్ చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదు. అదానీ ఈ ఇన్వెస్టిగేషన్‌ని ఆపలేకపోవచ్చు..కానీ ప్రధాని ఆపగలరు. అదే జరిగింది"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఇన్వెస్టిగేషన్‌ని అడ్డుకోవడంతోనే ఇక్కడ అవకతవకలు జరిగాయని అర్థమవుతోందని, కచ్చితంగా దేశ ప్రజలకు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరముందని అన్నారు.
"జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిన అవసరముంది. ప్రధాని మోదీ ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారో చెప్పాలి. ఇంత జరుగుతున్నా ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారు. నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. G20 లీడర్స్ ఇండియాకి వచ్చే ముందు ఇలాంటి వ్యవహారాలు బయటపడడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
Also Read: చందమామపై చిన్న పిల్లాడిలా ఆడుకుంటున్న ప్రజ్ఞాన్ రోవర్, వీడియో విడుదల చేసిన ఇస్రో