దేశంలో విపక్ష పార్టీలు అన్నీ కలిసి కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై పోలీస్ కేసు కూడా నమోదైంది. కాంగ్రెస్ పార్టీ సహా మొత్తం 26 రాజకీయ పార్టీలు దేశం పేరును తప్పుడు ప్రయోజనం కోసం వాడుకుంటున్నాయని డాక్టర్ అవినాష్ మిశ్రా అనే వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలోని బరాఖంబా పోలీస్ స్టేషన్ లో ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 1950 నాటి ఎంబ్లమ్స్ యాక్ట్‌లో పొందుపరిచిన అంశాల ఆధారంగా ప్రతిపక్ష కూటమి ఆమోదించుకున్న పేరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పేరు సదరు చట్టానికి విరుద్ధంగా ఉందని ఆయన వివరించారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు.






బీజేపీని ఎదుర్కొనేందుకు ఏకమైన విపక్ష కూటమి వ్యూహంలో భాగంగా తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. నిన్న (జూలై 19) బెంగళూరులో విపక్ష పార్టీల నేతల భేటీలో ఈ పేరును అందరూ ఆమోదించుకున్నారు. ‘భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్ఠి కూటమి’గా పేరును నిర్ణయించాయి. రాహుల్ గాంధీ ఈ పేరును ప్రతిపాదించారని.. ఈ పేరుపై నేతలంతా సుముఖత, ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పేరును ఖర్గే అధికారికంగా ప్రకటించారు. I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ (INDIA)గా నూతన కూటమికి పేరు పెట్టారు. అంతకుముందు యూపీఏ (యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్) ఉన్న సంగతి తెలిసిందే.


పాల్గొన్న 26 విపక్ష పార్టీలు


ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు పాల్గొన్నాయి.