Karnataka Assembly Session:
గందరగోళం..
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కాసేపటికే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. బీజేపీ నిరసనల మధ్యే ప్రభుత్వం పలు బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు BJP ఎమ్మెల్యేలు డిప్యుటీ స్పీకర్‌పై పేపర్లు విసిరారు. వెంటనే బౌన్సర్లు వచ్చి వాళ్లను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ గందరగోళం కారణంగా సభ వాయిదా పడింది. డిప్యుటీ స్పీకర్‌పై పేపర్‌లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. లంచ్ బ్రేక్ విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. IAS అధికారులను ప్రతిపక్ష నేతలతో భేటీ కావాలని ఉసిగొల్పి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. బడ్జెట్‌పై చర్చ కొనసాగుతుందని, లంచ్ బ్రేక్ ఇవ్వలేమని డిప్యుటీ స్పీకర్ రుద్రప్ప లమని తేల్చి చెప్పడమూ ఈ ఆందోళనలకు కారణమైంది. భోజనం చేయాలనుకునే వాళ్లు వెళ్లి రావచ్చని చెప్పారు రుద్రప్ప. అయితే..దీనిపై అసహనం వ్యక్తం చేసిన బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. 30 మంది IAS అధికారులను కాంగ్రెస్ మిత్రపక్ష నేతలకు సర్వెంట్‌లుగా మార్చేశారని ఆరోపించారు. తీవ్ర ఆగ్రహంతో డిప్యుటీ స్పీకర్‌పై పేపర్లు విసిరారు. "ఏ రూల్ ఆధారంగా లంచ్ బ్రేక్ రద్దు చేశారో చెప్పండి" అంటూ నినదించారు. డిప్యుటీ స్పీకర్ చుట్టూ మార్షల్స్ వచ్చి నిలబడ్డారు. ఆ తరవాత ఈ ఆందోళనలకు కారణమైన 10 మంది ఎమ్మెల్యేలను సెషన్‌లో ఉండకుండా సస్పెండ్ చేశారు. బీజేపీ తీరుపై కాంగ్రెస్ మండి పడింది. ముందు రోజు బీజేపీ, జేడీఎస్ ఆందోళనల మధ్యే 5 బిల్స్‌ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.