Coimbatore Press Club: సాధారణంగా ఏదైనా ఈవెంట్స్‌కు ఆహ్వానం అందితే కవర్ చేసేందుకు జర్నలిస్టులు వెళుతుంటారు. ఇదే తీరుగా తమకు ఆహ్వానం అందడంతో ఓ యూనివర్సిటీ ఈవెంట్ కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులకు చేదు అనుభవం ఎదురైంది. ఇన్విటేషన్ పాస్‌తో పాటు ఇచ్చిన ఎన్వలప్‌లో ఏముందో గమనించిన జర్నలిస్టులు ఆవేదన చెందారు. వార్త రాసేందుకు లంచం ఇచ్చి తమను అవమానించిన వర్సిటీ క్షమాపణ చెప్పాలని, తమ ప్రొఫెషన్‌ను అవమానించారని జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు జర్నలిస్టులు. వర్సిటీ మేనేజ్‌మెంట్ చేసిన పనికి తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రెస్ క్లబ్ ఓ ప్రకటనలో పేర్కొంది.


అసలేం జరిగిందంటే..
తమిళనాడులోని కోయంబత్తూరులో భారతీయార్ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీ 37వ స్నాతకోత్సవం (37th convocation Of Bharathiar University) మే 13న నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్‌ను కవర్ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరడంతో ఆయా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు తమ ప్రతినిధులను వర్సిటీ స్నాతకోత్సవాన్ని కవర్ చేసేందుకు పంపించాయి. కాన్వోకేషన్‌ ఈవెంట్‌కు హాజరైన జర్నలిస్టులకు ఇచ్చిన జర్నలిస్ట్ కిట్ కవర్‌లో రూ.500 ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. వర్సిటీ ఈవెంట్ కోసం వెళ్లిన తమకు దక్కిన మర్యాద, గౌరవం ఇది అని ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు జర్నలిస్టులు జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రోగ్రాం పూర్తయ్యాక వైస్ ఛాన్స్‌లర్ పి కలిరాజ్‌ను కలిసిన కొందరు జర్నలిస్టులు తమకు వర్సిటీ ఇచ్చిన మనీ కవర్లను తిరిగిచ్చేశారు. బాధ్యులపై తాను చర్య తీసుకుంటానని జర్నలిస్టులకు సర్దిచెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.






కోయంబత్తూరు ప్రెస్ క్లబ్ స్ట్రాంగ్ యాక్షన్..
స్నాతకోత్సవాలు కవర్‌ చేయడానికి వచ్చిన విలేకరులకు నగదు ఇచ్చి వారిని అవమానించారని కోయంబత్తూరు ప్రెస్ క్లబ్ అభిప్రాయపడింది. ఈవెంట్ కవర్ చేయడానికి హాజరైన జర్నలిస్టులకు వర్సిటీ యాజమాన్యం, నగదు ఇవ్వడానికి బాధ్యులు క్షమాపణ కోరాలని డిమాండ్ చేసింది ప్రెస్ క్లబ్. తాము డబ్బులు తీసుకుని అక్షరాలు అమ్ముకునే వారిలా కనిపిస్తున్నామా అని ప్రశ్నించింది. తమిళనాడు రాజ్‌భవన్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేసి విషయం తీవ్రతను ప్రెస్ క్లబ్ అందరికీ తెలిసేలా చేసింది.






జర్నలిజం విలువలు కాపాడిన కోయంబత్తూర్‌ ప్రెస్‌క్లబ్‌ కి  జై  అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. వర్సిటీ స్నాతకోత్సవం వార్త రాసేందుకు నగదు ఇవ్వడానికి కారకులు జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ కోరాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కోయంబత్తూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వి పెచికుమార్, సెక్రటరీ ఎస్ శ్రీనివాసన్, కోశాధికారి పీఆర్ ముథుపండి, ఉపాధ్యక్షుడు టి విజయ్, ప్రెస్ క్లబ్ కార్యవర్గం డిమాండ్ చేసింది.