COBRA Unit: జమ్ము కశ్మీర్ లో సీఆర్పీఎఫ్ అత్యున్నత దళమైన కోబ్రా (ది కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసొల్యూట్‌ యాక్షన్‌) యూనిట్ ను రంగంలోకి దించబోతుంది. ఈక్రమంలో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే వామపక్ష ఉగ్రవాదంపై పోరాడటంలో కోబ్రా యూనిట్స్ కు సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఈ దళం బిహార్‌, ఝార్ఖండ్‌లో పని చేయగా.. తాజాగా జమ్ము కశ్మీర్‌ లోని కుప్వారాలో విధులు నిర్వహిస్తోంది.


ఏప్రిల్‌ నెలలో శిక్షణ నిమిత్తం జమ్ము కశ్మీర్ కు వచ్చిన ఈ దళం ఇక్కడే ఉంటోంది. ఇప్పటి వరకు ఈ జవాన్లకు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పలేదు. కానీ వీరు ఇక్కడే మోహరించారు. అడవుల్లో ప్రత్యేకమైన గెరిల్లా యుద్ధ తంత్రం కోసం కోబ్రా దళాన్ని ఏర్పాటు చేశారు. వీరికి అడవుల్లో పోరాడేందుకు మంచి శిక్షణ ఇస్తారు. ఇలా వీరు ఈ అడవుల్లో పోరాడడంలో మంచి అనుభవాన్ని కల్గి ఉంటారు. అయితే ఈ దళ సభ్యులను శిక్షణ సమయంలోనే మానసికంగా, శారీరకంగా చాలా కఠినంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. శిక్షణానంతరం వీరు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని దళాలు మాత్రం ఈశాన్య భారత దేశంలో వేర్పాటు వాదంపై పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. 


మరోవైపు అనంత నాగ్ లో ఆగిన కాల్పులు


జమ్ము కశ్మీర్‌లోని అనంత నాగ్‌ లో  ఈరోజు కాల్పులు ఆగాయి. ఆదివారం రోజు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. నిన్న భద్రతా దళాలు డ్రోన్లు ఎగుర వేసి ఉగ్ర స్థావరాల వద్ద  మృతదేహాలను గుర్తించాయి. సోమవారం ఉదయం నుంచి కాల్పులు చోటు చేసుకోకపోవడంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే కుళ్లిపోయిన స్థితిలో ఓ ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆర్మీ కల్నల్‌ మన్‌ ప్రీత్‌ సింగ్‌, మేజర్‌ ఆశిష్ ధోన్‌చక్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ హుమాయిన్‌ భట్‌లు అమరులు అయ్యారు. కాగా మరోసారి జరిగిన కాల్పుల్లో మరో జవాను మృతి చెందారు. అయితే కొన్ని గంటల పాటు చనిపోయిన జవాను మృతదేహం లభ్యం కాలేదు. తర్వాత దొరికినట్లు తెలుస్తోంది. దీంతో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన అధికారుల సంఖ్య నాలుగుకు చేరింది. చనిపోయిన జవాను వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. లష్కరే తోయిబాకు చెందిన షాడో గ్రూప్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఈ దాడికి పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ అధికారుల మృతితో జవాన్లు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రస్థావరాలపై దాడులు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎంత మంది ఉగ్రవాదులు మరణించారనే అంశంపై వివరాలు వెల్లడించ లేదు. 


మరోవైపు భద్రతా దళాల ప్రాణ నష్టానికి తాము ప్రతీకారం తీర్చుకుంటామని జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తెలిపారు. ఉగ్రనాయకులు దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. భద్రతా దళాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. దేశం మొత్తం వాటి వెంటనే ఉంటుందని వెల్లడించారు. 


Read Also: J&K Firing: జమ్ముకశ్మీర్‌లో మరో జవాను మృతి-కొనసాగుతున్న ఆపరేషన్‌