జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో సెక్యురిటీ సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆర్మీ కల్నల్‌ మన్‌ ప్రీత్‌ సింగ్‌, మేజర్‌ ఆశిష్ ధోన్‌చక్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ హుమాయిన్‌ భట్‌లు అమరులయ్యారు. కాగా మరోసారి జరిగిన కాల్పుల్లో మరో  జవాను మృతిచెందారు. అయితే కొన్ని గంటల పాటు చనిపోయిన జవాను మృతదేహం లభ్యంకాలేదు. తర్వాత దొరికినట్లు తెలుస్తోంది. దీంతో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన అధికారుల సంఖ్య నాలుగుకు చేరింది. చనిపోయిన జవాను వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. 


లష్కరే తోయిబాకు చెందిన షాడో గ్రూప్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఈ దాడికి పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ అధికారుల మృతితో జవాన్లు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తున్నారు.భారీగా బలగాలను అనంతనాగ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలోనే నిన్న మరోసారి కాల్పులు, బాంబు పేలుళ్లు వినిపించాయి. అనంతనాగ్‌లో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు అధికారులు నిన్న వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే అంశంపై వివరాలు వెల్లడించలేదు. ఉగ్రదవాదులను కనిపెట్టేందుకు పోలీసులు అనంతనాగ్‌ ప్రాంతంలో అధిక సర్వైలెన్స్‌ కెపాసిటీ ఉన్న హెరోన్‌ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అత్యాధునిక పరికరాలను, నైట్‌ విజన్‌ డివైజెస్‌ను కూడా వాడుతున్నారు. 


మేజర్‌ ఆశిష్‌ ధోన్‌చక్‌ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఈరోజు ఆయన స్వస్థలమైన హర్యానాలోని పానిపట్‌కు తరలించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మేజర్‌ ఆశిష్‌, కల్నల్‌ మన్‌ప్రీత్‌లకు నిన్న జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా నివాళులర్పించారు. జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ఈ ఘటన పట్ల, సైనికుల మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదని పేర్కొన్నారు.


ఈ దాడులపై జమ్ములో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాదులే ఈ పని చేశారని, పాక్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. జమ్ములో భారతీయ జనత యువ మోర్ఛ ఆందోళన చేపట్టింది. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌పై దాడికి నిరసనగా నినాదాలు చేసింది. జమ్ముకశ్మీర్‌లో స్థానికులు, పోలీసులు క్యాండిల్‌ ర్యాలీలు చేపట్టారు. 


నిన్న జమ్ముకశ్మీర్‌లోని హంద్వారా ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగు కనిపించింది. హంద్వారా బారాముల్లా హైవేపై ఈ ఘటన జరిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను ఆపేసి అక్కడికి చేరుకుని బ్యాగులో ఉన్న ఐఈడీ బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. రాజౌరీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన జవాను రవి కుమార్‌ అంత్యక్రియలు గురువారం స్వస్థలమైన కిష్టావర్‌లో జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన కల్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అంత్యక్రియలు కూడా నిన్న జరిగాయి. కుటుంబ సభ్యులు కల్నల్ సింగ్‌ని తలుచుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. ఉదయమే తాము కాల్ చేసి మాట్లాడామని, మళ్లీ కాల్ చేస్తా అని వెంటనే కాల్ కట్ చేశాడని చెప్పారు. గతేడాది సేనా మెడల్ అందుకున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. అమర జవాన్లకు ఆర్మీ అధికారులు నివాళులు అర్పించారు.