Chennai: కారు బుకింగ్‌కు సంబంధించిన ఓటీపీ నంబర్ చెప్పకుండా వాహనం ఎక్కినందుకు ఓ క్యాబ్ డ్రైవర్.. ప్రయాణికుడ్ని కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది.  






ఇదీ జరిగింది


చెన్నై శివారులోని గూడువాంజేరి సమీపంలోని కన్నివాక్కం కుందన్‌నగర్‌లో ఉంటున్న ఉమేందర్ (33) కోయంబత్తూర్‌లో ఐటీ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ప్రతి శనివారం చెన్నై వచ్చి కుటుంబంతో గడుపుతుంటాడు. అయితే ఆదివారం ఉమేందర్ భార్య భవ్య, వారి పిల్లలు, భవ్య సోదరి, వారి పిల్లలు కలిసి నవలూర్‌లోని మాల్‌లో మధ్యాహ్నం 3.30 గంటల షోకు సినిమా చూద్దామని బయలుదేరారు.


ఓటీపీ చెప్పలేదని


ఇందుకోసం వారు ఓలాలో ఓ క్యాబ్ బుక్ చేశారు. వారిని పికప్ చేసుకునేందుకు క్యాబ్ డ్రైవర్ రవి అక్కడికి చేరుకున్నారు. అయితే ఓటీపీ చెప్పకుండా వారు కారులో ఎక్కేసరికి, రవికి ఆగ్రహం వచ్చింది. ముందు ఓటీపీ చెప్పి తర్వాత క్యాబ్ ఎక్కాలని వారిని దించేశాడు. అంతేకాకుండా ఏడుగురు ఉన్నందున ఉమేందర్ కారు బదులు ఎస్‌యూవీ బుక్ చేసి ఉండాల్సిందని రవి చెప్పాడు. దీంతో రవి, ఉమేందర్ మధ్య మాటామాటా పెరిగింది. 


ఆ తర్వాత ఉన్నట్టుండి ఉమేందర్ తలపై రవి.. తన ఫోన్‌తో గట్టిగా కొట్టాడు. అనంతరం ఉమేందర్‌పై పిడి గుద్దులు కురిపించాడు. దీంతో ఉమేందర్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే ఉమేందర్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


మరోవైపు తప్పించుకుని పారిపోబోయిన రవిని.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన కేలంబాక్కం పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. ఓటీపీ విషయంలో చెలరేగిన వివాదం చివరికి ఓ నిండు ప్రాణాన్ని తీసిందని ఉమేందర్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనకు కారణమైన క్యాబ్ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read: Heavy Rains In Maharashtra: మహారాష్ట్రలో వరుణుడి ధన్‌ధనాధన్‌ బ్యాటింగ్- నీట మునిగిన ముంబయి


Also Read: Agnipath Recruitment Scheme: 'అగ్నిపథ్‌'లో మహిళలకు 20 శాతం రిజర్వేషన్- ఇండియన్ నేవీ బంపర్ ఆఫర్!