Chattishgarh Man Dies After Swallowing Surviving Chick: మూఢ నమ్మకం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ మంత్రగాడి మాట విన్న సదరు వ్యక్తి సంతానం కోసం బతికున్న కోడిపిల్లను మింగేసి ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని (Chattishgarh) అంబికాపూర్‌లో చింద్‌కాలో గ్రామానికి చెందిన ఆనంద్ యాదవ్ (35) సంతానం కోసం స్థానికంగా ఉండే ఓ తాంత్రికుడిని ఆశ్రయించాడు. అతని సూచన మేరకు బతికున్న కోడిపిల్లను మింగేశాడు. అయితే, అది గొంతులోనే ఇరుక్కుపోవడంతో ఊపిరాడక కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అంబికాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
అదే ట్విస్ట్..
మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. గొంతు వద్ద బతికున్న కోడిపిల్లను బయటకు తీశారు. 20 సెంటీమీటర్ల పొడవున్న కోడిపిల్ల అతని గొంతులో ఇరుక్కోవడంతో మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. తన కెరీర్‌లో 15 వేల పోస్టుమార్టంలు చేశానని.. ఇలాంటి కేసు మాత్రం ఎన్నడూ చూడలేదని వైద్యుడు సంతుబాగ్ పేర్కొన్నారు.