Chandrayaan-3: చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను రీయాక్టివేట్ చేయడాన్ని ఇస్రో వాయిదా వేసింది. మొదట సెప్టెంబర్ 22వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం ల్యాండర్ ను, రోవర్ ను రీయాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తామని ఇస్రో తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల రీయాక్టివేషన్ ను శనివారానికి వాయిదా వేసినట్లు స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. 


'అంతకుముందు సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం ప్రజ్ఞాన్ రోవర్ ను, విక్రమ్ ల్యాండర్‌ను రీయాక్టివేట్ చేయాలని ప్లాన్ చేశాం. అయితే కొన్ని కారణాల వల్ల దానిని సెప్టెంబర్ 23 శనివారానికి వాయిదా వేశాం. స్లీప్ మోడ్ నుంచి ల్యాండర్, రోవర్‌లను తీసేసి, వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడానికి ఇస్రో వద్ద సరైన ప్రణాళిక ఉంది' అని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. 


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ల్యాండర్, రోవర్ లు చంద్రుని దక్షిణ ధ్రువంలో 16 రోజుల పాటు స్లీప్ మోడ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన అక్కడ పగలు మొదలైంది. ఈ సమయంలో ల్యాండర్ ను, రోవర్ ను రీయాక్టివేట్ చేయాలని ఇస్రో ప్రణాళిక వేసింది. రోవర్ ను దాదాపు 300 నుంచి 350 మీటర్లకు తీసుకెళ్లాలనని ప్లాన్ చేసినట్లు నీలేష్ దేశాయ్ తెలిపారు. అయితే శుక్రవారం నుంచి శనివారం రోజుకు రీయాక్టివేషన్ ను వాయిదా వేసినట్లు తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్ల మేర కదిలి పరిశోధనలు చేపట్టింది. 






బుధవారం శివశక్తి పాయింట్ వద్ద సూర్యకాంతి రాకతో వాటిని తిరిగి కార్యాచరణలోకి తీసుకురావడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువం చంద్రయాన్-3 దిగిన ప్రాంతంలో సూర్యోదయం జరిగిందని, బ్యాటరీలు రీఛార్జ్ చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని ఇస్రో తెలిపింది. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లతో మళ్లీ కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


ల్యాండర్, రోవర్ పనిచేయడానికి అవసరమైన వేడిని అందజేసే సూర్యోదయం అవసరమని ఇస్రో తెలిపిందది. సెప్టెంబరు 22న కమ్యూనికేషన్ ప్రయత్నాలను ప్రారంభిస్తామని, అయితే అంతకంటే ముందు ఉష్ణోగ్రత ఒక నిర్దిష్ట స్థాయికి మించి పెరిగే వరకు వేచి ఉండాలని మొదట ఇస్రో పేర్కొంది. ఇక విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఆగస్టు 23న ల్యాండింగ్ అయినప్పటి నుంచి వివిధ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. చంద్రుని అయానోస్పియర్‌లోని ఎలక్ట్రాన్ సాంద్రతలను కొలిచాయి. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత రీడింగ్‌లను సేకరించాయి. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ మొదటి చిత్రాన్ని తీసింది.  


14 రోజుల సుధీర్ఘ పరిశోధనల అనంతరం చంద్రుడిపై సూర్యాస్తమయం అయ్యింది. బ్యాటరీ వాహనాలు నడిచేందుకు సరైన సౌరశక్తి లభించనందున విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌‌ను స్లీప్ మోడ్‌లో ఉంచాయి. విక్రమ్ ల్యాండర్‌లో పేలోడ్స్‌గా పంపించిన చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు పేలోడ్స్ అన్నీ ప్రస్తుతం టర్న్ ఆఫ్ మోడ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రోవర్‌కు అమర్చిన రిసీవర్ మాత్రమే స్విచాన్‌లో ఉంది. అది చీకటి రాత్రుల్లో కూడా కూడా పని చేయగలుగుతుంది.