Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు ఇక మేల్కొంటాయన్న ఆశలు లేవని ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ అన్నారు. ల్యాండర్, రోవర్ లు ఇంకా నిద్రాణస్థితి నుంచి బయటకు రావడం లేదు. సెప్టెంబర్ 22వ తేదీన చంద్రుడిపై సూర్యోదయం అయినప్పటికీ ల్యాండర్, రోవర్ లు ఇంకా మేల్కొవడం లేదు. ఇస్రో వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తున్నా.. ఫలితం లేదు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు మేల్కొంటాయన్న ఆశలు కనిపించడం లేవని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. భారత్ ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్-3 ప్రాజెక్టు ఇక ముగిసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. 


ల్యాండర్, రోవర్ లు మేల్కొంటాయన్న నమ్మకం లేదని చెప్పారు. ఒక వేళ మేల్కోవాల్సి ఉంటే ఇప్పటికే అది జరిగి ఉండేదన్నారు. ఇక విక్రమ్, ప్రజ్ఞాన్ నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని అన్నారు. చంద్రయాన్-3 నుంచి అనుకున్న ఫలితం ఇప్పటికే వచ్చిందని, ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 కాలుమోపిందని స్పేస్ కమిషన్ మెంబర్ అయిన ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి ఎంతో విలువైన సమాచారం ఇస్రోకు అందిందన్నారు. ఆ సమాచారం కచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పారు. తదుపరి చేపట్టే ప్రాజెక్టుల్లో విజ్ఞానపరంగా, ప్లానింగ్ పరంగా ఆ ప్రాంతానికి సంబంధించి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని కిరణ్ కుమార్ తెలిపారు.


చంద్రుని నుంచి నమూనాలను తీసుకు రావడం భవిష్యత్తులో సాధ్యం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక సామర్థ్యాలు పెరగడం వల్లే చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో చంద్రుని నుంచి నమూనాలు సేకరించి భూమిపైకి తీసుకువచ్చే ప్రాజెక్టులు కచ్చితంగా ఉంటాయని తెలిపారు. టెక్నాలజీ అభివృద్ధి ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు.


చంద్రయాన్‌-3 జీవితకాలం 14 రోజులే. చంద్రుడిపై దిగిన ల్యాండర్‌... జాబిల్లిపై తిరుగుతున్న రోవర్‌... ఏ ప్రయోగాలు చేసినా.. ఏ ఫొటోలు, వీడియోలు తీసినా ఆ 14 రోజులే. ఏం  చేసినా... అప్పడే చేయాలి. 14 రోజులు దాటితే అంతా ప్రతికూలతే. ఎలా ఎందుకు? అసలు ఈ 14రోజుల టార్గెట్‌ ఏంటి? చంద్రుడి ఉపరితలంపై ఒక రోజు అంటే భూమిపై  సుమారుగా 28 రోజులతో సమానం. అంటే మన లెక్కప్రకారం 14 రోజులు చంద్రుడి ఉపరితలంపై పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది.


భూమిపై 14 రోజుల కాలం... చంద్రుడిపై ఒక్క పగలుతో సమానం. ఆ తర్వాత చంద్రుడిపై సూర్యుడు అస్తమిస్తాడు. వెంటనే చంద్రుడి ఉపరితలం అంతా చీకటిగా మారిపోతుంది.  దీంతో అక్కడ చిమ్మ చీకటి అయిపోతుంది. దీంతో పాటు ఉష్ణోగ్రత కూడా ఏకంగా మైనస్ 180 డిగ్రీలకు పడిపోతాయి. ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు చేరుకుంటే చంద్రయాన్  రోవర్, ల్యాండర్ రెండూ గడ్డకట్టిపోవడం ఖాయం. తిరిగి మరో 14 రోజుల తర్వాత అంటే చంద్రుడిపై రాత్రి గడిచిన తర్వాత అక్కడ సూర్యుడి వెలుగు వస్తుంది. అప్పుడు మళ్లీ  ల్యాండర్, రోవర్ పై సూర్యకిరణాలు పడతాయి. అయితే అప్పటికే గడ్డకట్టుకు పోయిన ఈ రెండూ తిరిగి మంచును కరిగించుకుని తిరిగి పనిచేయగలిగితే... మరో అద్భుతం  జరిగినట్టే అని అంటున్నారు  ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్‌.