చంద్రయాన్- 3 ప్రయోగంలో ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం మరో ఘనత సాధించారు. ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ మంగళవారం భూ కక్ష నుంచి చంద్రుడి కక్ష్యలో ప్రవేశ పెట్టే తుది దశ విజయవంతమైంది. ఉపగ్రహంలోని ఇంధనాన్ని 28 నుంచి 31 నిమిషాలు పాటు మండించి లూనార్ అర్బిట్‌లోకి శాస్త్రవేత్తలు పంపించారు. చంద్రుని కక్షలోకి చంద్రయాన్ ప్రవేశించడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఇస్రో గత నెల 14వ తేదీన చంద్రయాన్‌-3 విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ ప్రవేశపెట్టింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3 ప్రయోగానికి శ్రీకారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది.






ప్రయోగం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు కక్ష్య పొడిగింపు చేపట్టారు. జులై 14వ తేదీన ప్రయోగం చేపట్టగా.. జులై 15వ తేదీన మొదటి కక్ష్యలోకి చేరుకుంది. జులై 16వ తేదీన రెండో కక్ష్యలోకి ప్రవేశించింది. జులై 18వ తేదీన మూడోది, జులై 20వ తేదీన 4వ కక్ష్య, జులై 25న లోకి 5వ కక్ష్య ప్రవేశించి భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది. సోమవారం అర్ధరాత్రి తరువాత జరిగిన కక్ష్య పొడిగింపుతో చంద్రయాన్ భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించేలా మరోసారి కక్ష్య పొడిగింపు జరిగింది. ఇందుకోసం సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లో నింపిన అపోజి ఇంధనాన్ని మండించి చంద్రయాన్‌–3 మిషన్‌ను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యవైపు మళ్లించే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. 


అక్కడ నుంచి ఐదు రోజుల పాటు చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమించి వంద కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి తీసుకురావడానికి ఐదు రోజుల సమయం తీసుకుంటుంది. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆగస్టు 23వ తేదీన ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. తర్వాత అది ల్యాండర్‌ను జార విడుస్తుంది. ఆ రోజు సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో దిగుతుంది. ల్యాండర్‌ తెరచుకుని లోపలి నుంచి రోవర్‌ బయటకు అడుగుపెట్టనుంది. అది చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేసి సమాచారాన్ని అందిస్తుంది. చంద్రయాన్ - 3 రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపిన సంగతి తెలిసిందే. 


చంద్రయాన్ చంద్రుని కక్ష్యను చేరుకోవడం ప్రయోగంలో ఒక భాగమే. గతంలో ప్రయోగించిన రెండు వ్యోమనౌకలను ఇస్రో చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టగలిగింది. 2008 చంద్రయాన్-1, 2019 చంద్రయాన్-2 ప్రయోగ సయమంలోను ఇస్రో చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. కానీ అసలైన సవాలు ఎదురయ్యేది మాత్రం చంద్రడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సమయంలో మాత్రమే. ఆగస్టు 23వ తేదీ తర్వాత ఈ ల్యాండింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు ఇస్రో అధికారులు సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనుకున్నది అనుకున్నట్లు ప్రణాళికబద్ధంగా జరిగితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గోదేశంగా భారత్ నిలవనుంది. రష్యా, అమెరికా, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ రికార్డులకెక్కనుంది.