Chandrayaan 3 Launched:


చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చంద్రయాన్ 3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. ఇక్కడ సాఫ్ట్‌ల్యాండింగ్ అయితే...ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అయినట్టు లెక్క.ఈ ప్రయోగంపై స్పేస్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ చరిత్రలో భాగమవుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని వెల్లడించారు. ఇండియా మొత్తం గర్వపడేలా చేసినందుకు ఇస్రోకి అభినందనలు తెలిపారు. కౌంట్‌డౌన్ పూర్తైన వెంటనే రాకెట్‌ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం మూడు దశల్లో ఒక్కో దశను సక్సెస్‌ఫుల్‌గా దాటుకుంటూ వెళ్లింది రాకెట్. ఆ తరవాత ప్రపల్షన్ మాడ్యూల్ విడిపోయి విజయవంతంగా చంద్రయాన్ 3 కక్ష్యలోకి చేరుకుంది. మూడో దశ పూర్తైన వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఒకరికొకరు అభినందనలు చెబుతూ సంబరాలు చేసుకున్నారు. 3.5లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించిన తరవాత చంద్రయాన్ 3 చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుంది.