Chandrayaan 3 Launch: 

తక్కువ ఖర్చుతోనే..

తక్కువ ఖర్చు. ఎక్కువ లాభాలు. ఇస్రో (ISRO) ఇప్పుడిదే సూత్రాన్ని ఫాలో అవుతోంది. చంద్రయాన్ 3 లాంటి భారీ మిషన్‌కి ఖర్చు చేసిన మొత్తం కేవలం రూ.615 కోట్లు. కానీ అది సక్సెస్ అయితే వచ్చే లాభం మాత్రం భారీగానే ఉంటుంది. అందుకే..ఇండియా మాత్రమే కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా చంద్రయాన్ 3 మిషన్‌ని (Chandrayaan 3 Mission) ఆసక్తిగా గమనిస్తోంది. చంద్రయాన్ 2 మిషన్‌కి ఫాలోఅప్‌గా వస్తున్న చంద్రయాన్ 3 కచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమాగా ఉన్నారు సైంటిస్ట్‌లు. అంతా అనుకున్నట్టుగా జరిగి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయితే ఇక ఇస్రోకి తిరుగుండదు. ఇప్పటికే నాసానే ఆశ్చర్యపోయే స్థాయిలో ప్రయోగాలు చేపడుతోంది. ఇక మార్స్ మిషన్‌ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. కొన్నేళ్లుగా స్పేస్ రీసెర్చ్‌లో (India Space Research) ఇస్రో గట్టిగానే పునాది వేసుకుంటూ వచ్చింది. ఎంతలా అంటే...విదేశాలు కూడా మనల్ని నమ్మి వాళ్ల శాటిలైట్స్‌ని ఇస్రో ప్రయోగాలతో పంపేంతగా. ఓ వైపు అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ఎంట్రీ ఇచ్చి పోటీ ఇస్తున్నా..వాటిన్నింటికీ దీటుగా నిలబడుతోంది ఇస్రో. అంతే కాదు. ఇండియన్ స్పేస్ సెక్టార్ పవర్ ఏంటో చూపిస్తోంది. 

పెరిగిన నిధులు..

2023-24 బడ్జెట్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధనలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ. 12,543 కోట్ల నిధులు కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇది కాస్త తక్కువే అయినప్పటికీ...ఆరేళ్లలో చూసుకుంటే నిధుల కేటాయింపు బాగానే పెరిగింది. అందులోనూ భవిష్యత్‌లో అత్యంత కీలకమైన గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్న తరుణంలో ఈ నిధుల కేటాయింపు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇచ్చిన నిధులను జాగ్రత్తగా ఖర్చు చేయడం ఇస్రోకి తెలుసు. అందుకే...తక్కువ ఖర్చుతోనే భారీ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతోంది. ఏ మిషన్ చేపట్టినా దానికయ్యే ఖర్చెంత అని క్లియర్‌గా చెప్పేస్తుంది. పదేళ్ల చరిత్రే ఇందుకు నిదర్శనం. ఉన్న వనరులను ఎంత బాగా వాడుకోవాలో ఇస్రోకి తెలుసు. ఈ విషయంలో ఈ సంస్థ ఆరితేరిపోయింది. మార్స్, మూన్ ప్రాజెక్ట్‌ల కోసం ఇస్రో చేసిన ఖర్చు...క్రిష్టఫర్ నోలన్ తీసిన ఇంటర్‌స్టెల్లార్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ. ఇండియాలోనే కీలక పరికరాలన్నీ తయారయ్యేలా కృషి చేస్తుండటం వల్ల ఆ మేరకు ఖర్చులు తగ్గుతున్నాయి. 

ఇదీ ఇస్రో పొటెన్షియల్..

ఖర్చు తక్కువే అయినా..రెవెన్యూ మాత్రం బాగానే వస్తోంది. కేంద్రం లెక్కల ప్రకారం..2019-21 మధ్య కాలంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లతో ఇస్రో రూ.288 కోట్లు సంపాదించింది. కమ్యూనికేషన్ శాటిలైట్స్‌కి డిమాండ్ పెరుగుతుండటం వల్ల ఇస్రోకి మరింత డిమాండ్‌ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థ కెపాసిటీ ఏంటో గమనించిన కేంద్ర ప్రభుత్వం  Indian National Space Promotion and Authorization Centreని ఏర్పాటు చేసింది. వెహికిల్ లాంఛింగ్ దగ్గర నుంచి స్పేస్‌కి సంబంధించిన అన్ని సర్వీస్‌లనూ ఈ సెంటర్ అందిస్తుంది. గత కొన్నేళ్లలో అంతరిక్ష రంగంలోకి పలు స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. ఈ కారణంగా...ఇండియా పొటెన్షియల్ ఏంటో ప్రపంచం గమనిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు పోటీనిస్తూ చరిత్రాత్మక ప్రయోగాలు చేపడుతోంది ఇస్రో. 

Also Read: Chandrayaan 3: పిట్టల్ని తోలే టెక్నిక్‌తో చంద్రయాన్ 3 ప్రయోగం