Chandrayaan-3: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో అద్భుతాన్ని సృష్టించింది. అంతరిక్ష రంగంలో చరిత్రను లిఖించింది. ఇప్పటి వరకు ఏ దేశమూ వెళ్లని చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చాలా సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ అయింది. అలా ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లోనే సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా, సాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.. ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
దేశం కోసం స్ఫూర్తిదాయక విజయం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని సోమనాథ్ వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారని, ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు అని సోమనాథ్ పేర్కొన్నారు. చంద్రయాన్-3 విజయవంతం అవ్వాలని కొన్ని రోజులుగా ప్రార్థించినన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చంద్రయాన్-2 మిషన్ నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయని వెల్లడించారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ లాంచ్ అంత సులువైన విషయం కాదని అన్నారు. చంద్రుని వచ్చే 14 రోజులు ఎంతో ఆసక్తికరమని తెలిపారు. చంద్రయాన్-3 ని ప్రతి భారతీయుడు ఎంతో ఆసక్తికగా చూస్తారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారని అన్నారు.
ఆదిత్య ఎల్-1 ను సెప్టెంబర్ లో లాంచ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఆదిత్య.. సూర్యుడి గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడనుందని చెప్పారు. గగన్ యాన్ అబర్ట్ మిషన్ కూడా అక్టోబరు మొదటి వారం లోపు చేస్తామన్నారు. విక్రమ్ హెల్త్ కండిషన్ చూడాలని, విజ్ఞాన్ రోవర్ వచ్చే 24 గంటల్లోపు చంద్రుడిపై దిగనుందని వెల్లడించారు. చంద్రయాన్-2 లో పని చేసిన అనేక మంది చంద్రయాన్-3కి పని చేశారని, చంద్రయాన్-2కి పని చేసిన వారు గత కొన్నేళ్లుగా సరిగా నిద్ర కూడా పోయి ఉండరని తెలిపారు. ఇస్రో చాలా బలంగా ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.
40 రోజులుగా ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ ఘట్టాన్ని చూసి ఆనందంతో సంబరపడిపోయాయి. సాఫ్ట్ ల్యాండింగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో సౌత్ పోల్ ను తాకిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది.