మహిళా రిజర్వేషన్ బిల్లును సభ ముందుకు ఈ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు కేంద్ర రెడీ అయినట్టు తెలుస్తోంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వషన్ కల్పించే బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. దీన్ని ఈ సమావేశాల్లో క్లియర్ చేసేందుకు బీజేపీ వ్యూహాన్ని రచిస్తోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ప్రతిపక్ష నేతలు కూడా ఈ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న టైంలో కేంద్రం ఓ ముందడుగు వేయాలని భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదంలో కూడా ఎలాంటి అవాంతరాలు ఉండవని ఆలోచిస్తోంది.
సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష కూటమి సహా ఎన్డీయే నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగ్గా, I.N.D.I.A. నాయకులే కాకుండా ఎన్డీయే నేతలు కూడా మద్దతుగా నిలిచారు. దీన్ని బట్టి ఈ బిల్లు పార్లమెంట్‌లో నెగ్గడం పెద్ద కష్టం కాదన్నది స్పష్టమైంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం మాట్లాడుతూ తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పింది. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలంతా లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని చాలా బలంగా సమర్థించారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడి నుంచి ఆమోదం పొందితే రాజ్యసభకు పంపుతారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏం చెప్పారు?
మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాల, బీజేపీ, దాని మిత్రపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. పార్లమెంటు కార్యకలాపాలను కొత్త భవనంలోకి మార్చిన సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించాలని బిఆర్ఎస్, టిడిపి, బిజెడి ప్రభుత్వాన్ని కోరాయి.
ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని వాదించినప్పటికీ, రిజర్వేషన్లలో వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు కోటాను నిర్ణయించే అంశాన్ని కూడా లేవనెత్తాయి.