Climate Change In India: భారతదేశం (India)లో వాతావరణ పరిస్థితులు (Weather Conditions) వేగంగా మారిపోతున్నాయి. దేశంలో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నిత్యం మారుతున్న పరిస్థితుల కారణంగా దేశ వ్యాప్తంగా వేలాది మరణాలు సంభవించాయని విశ్లేషించింది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (Center For Science And Environment) విడుదల చేసిన ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 


దేశం మొత్తం మీద ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకూ పరిశీలిస్తే 86 శాతం రోజుల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు నివేదిక వెల్లడించింది. దీంతో 2,923 మంది మృత్యువాత పడ్డారని, 20 లక్షల హెక్టార్లలోని పంట తుడిచిపెట్టుకుపోయిందని నివేదిక పేర్కొంది. 80 వేల గృహాలు ధ్వంసం అవగా 92 వేల జంతువులు మరణించాయి. వాస్తవంలో ఈ గణాంకాలు ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చని పేర్కొంది. దేశంలో కొంత వరకు మాత్రమే సమాచారం సేకరించామని, మొత్తం సేకరిస్తే వివరాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.


మండుతున్న భారతం
దేశ వ్యాప్తంగా 2023లో ప్రతికూల వాతావరణం ఉందని సీఎస్‌ఈ తన నివేదికలో వెల్లడించింది. 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదయ్యాయని తెలిపింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 138 రోజుల పాటు ప్రకృతి ప్రకోపాలు సంభవించగా, బిహార్‌ 642 మరణాలు సంభవించాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో  365, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 341 మరణాలు నమోదయ్యాయి.


వేల ఎకరాల్లో పంట నష్టం
వాతావరణ వైపరీత్యాలతో పంజాబ్‌లో అత్యధిక పశు మరణాలు సంభవించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా నివాసాలు దెబ్బతిన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 113 రోజుల్లో వాతావరణ వైపరీత్యాలు నమోదయ్యాయి. అస్సాంలో అత్యధికంగా 102 రోజులపాటు ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి. దక్షిణ భారతంలో అత్యధికంగా 67 వాతావరణ వైపరీత్య ఘటనలు జరిగాయి. 


కేరళలో 60 మరణాలు నమోదయ్యాయి. తెలగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో 62,000 హెక్టార్ల అత్యధిక పంట నష్టం సంభవించినట్లు సీఎస్‌ఈ తన నివేదికలో వెల్లడించింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 645 పశువులు మరణించాయని, కర్ణాటకలో 11,000 ఇళ్లు నేలమట్టం అయినట్లు నివేదిక తెలిపింది.


ఇటీవల హెచ్చరించిన ఐక్యరాజ్య సమితి
వాతావరణంలో మార్పులపై ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం కారణంగా మానవాళి మనుకగడకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. యూఎన్ వివరాల ప్రకారం.. మునుపటి శతాబ్దాలతో పోలిస్తే 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టాలు వేగంగా పెరుగు­తున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌ మించి పెరగకుండా పరిమితం చేయగలిగితే.. వచ్చే 2 వేల సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది. 


ఒకవేల 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే సముద్రాలు 6 మీటర్లు, 5 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదలతో సముద్రాలు 22 మీటర్లు వరకు పెరగవచ్చు. లోతట్టు ప్రాంతాలు, మొత్తం దేశాలు జలసమాధి అవుతాయి. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది.  


ప్రధాన నగరాలు జలమట్టం
ముంబై, కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్‌ ఏంజిలిస్, న్యూయార్క్, బ్యూనస్‌ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు వాటిల్లుతుంది.  ఈ పరిస్థితులను నియంత్రించడానికి గ్రీన్‌హౌస్‌ వాయువులు, కర్బన ఉద్గారాలను 2030 నాటికి కనీసం 43 శాతానికి, 2035 నాటికి 60 శాతానికి తగ్గించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.