Liquor Scam Probe: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయ్. మద్యం కుంభకోణం కేసును విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, వ్యాపారవేత్త అమన్‌దీప్‌ సింగ్‌ ధాల్‌ను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసి...జైలుకు పంపింది.  అరెస్ట్ కు ముందు...అమన్‌దీప్‌కు  అనుకూలంగా వ్యవహరించేందుకు అసిస్టెంట్ డైరెక్టర్ పవన్‌ ఖత్రి, ఈడీ క్లర్క్‌ నితేశ్‌ హోకర్‌... రూ.5 కోట్ల లంచం తీసుకున్నారని ఈడీ ఆరోపణలు చేసింది. 2022 డిసెంబరు నుంచి 2023 జనవరి మధ్య కాలంలో...ప్రవీణ్ అనే సీఏకు 5 కోట్ల లంచం ఇచ్చినట్లు అమన్‌దీప్‌, ఆయన తండ్రి బీరేందర్‌ పాల్‌ ఈడీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.


సీఏ ప్రవీణ్...ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పవన్‌ ఖత్రి, క్లర్క్‌ నితేశ్‌ హోకర్‌తో మాట్లాడారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే విషయంపై అమన్ దీప్, ఆయన తండ్రి బీరేందర్ పాల్...ఈడీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 7న ఈడీ...సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసింది. చార్టెడ్ అకౌంటెంట్ ప్రవీణ్, ఎయిరిండియా ఎయిర్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దీపక్‌ సంగ్వాన్‌...అమన్‌దీప్‌ నుంచి 5 కోట్లు తీసుకున్నట్లు వెల్లడించింది. 


5 కోట్లలో 50 లక్షలను పవన్‌ ఖత్రి, దీపక్‌ సంగ్వాన్‌లకు ఇచ్చినట్లు సీఏ ప్రవీణ్ దర్యాప్తులో అంగీకరించినట్లు స్పష్టం చేసింది. 2022లో వసంత్ విహార్ ఏరియాలోని ఐటీసీ హోటల్ వెనుక వైపున...అడ్వాన్స్ రూపంలో ముట్టజెప్పినట్లు అమన్ దీప్ వెల్లడించాడు. ఈ వ్యవహారంలో క్లారిడ్జెస్‌ హోటల్స్‌ సీఈవో విక్రమాదిత్య, అమన్‌దీప్ సింగ్ ధాల్, బీరేందర్ పాల్ సింగ్ పైనా సీబీఐ కేసు నమోదు చేసింది.