Brij Bhushan Retires From WFI : భారత రెజ్లింగ్ సమాఖ్య  (Wrestling Federation of India) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Saran Singh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 12ఏళ్ల పాటు రెజ్లింగ్ సేవలు అందించానని, క్రీడలతో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నట్లు తెలిపారు. ఛైర్మన్ గా సుదీర్ఘకాలం పాటు భారత రెజ్లింగ్ సమాఖ్యకు సేవలు అందించానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వెల్లడించారు. రెజ్లింగ్ వ్యవహారాలను కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన ప్యానెల్‌ను కేంద్రం సస్పెండ్ చేసిన రోజే, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో రెజ్లింగ్ వ్యవహారాల అంశమే చర్చకు రాలేదని వెల్డించారు. ఆ తర్వాత రెజ్లింగ్ కు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు అనేక రకాల బాధ్యతలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. సుదీర్ఘ కాలంగా రెజ్లింగ్ కు సేవలు అందించానని, ఇక నుంచి క్రీడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలు చూసుకోవడానికి తాత్కాలిక కమిటీని నియమించాలని ఐవోఏ కేంద్రాన్ని కోరింది. 


మరోవైపు భారత రెజ్లింగ్ సమాఖ్యపై వివాదం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఎన్నికైన  భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్‌ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ, క్రీడా శాఖ నిబంధనలకు విరుద్ధంగా పోటీల నిర్వహణకు కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ సిద్ధమయ్యారు. అండర్‌-15, అండర్‌-20 జాతీయ రెజ్లింగ్‌ పోటీలు నిర్వహించాలని ప్రకటన కూడా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నందినీ నగర్‌, గోండాలో  ఈ నెలాఖరులోపు నిర్వహిస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లకు సమయం ఇవ్వకుండా ప్రకటించడంపై క్రీడాకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా సంజయ్ సింగ్ ప్రకటన చేయడంతో కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. క్రీడా  శాఖ రూల్స్ ను  అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.  


రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ రాజీనామాతో ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సంజయ్  సింగ్, తన ప్రత్యర్థి అనితా షెరాన్ పై 40 ఓట్ల తేడాతో గెలుపొందారు.  బ్రిజ్‌ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్‌ సింగ్ ఎన్నికను కొందరు రెజ్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత స్టార్‌ రెజ్లర్లు సాక్షి మాలిక్‌, భజ్ రంగ్ పూనియాపాటు మరి కొందరు వ్యతిరేకించారు. సంజయ్ సింగ్ ఎన్నికకు నిరసనగా రెజ్లింగ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు సాక్షి మాలిక్ ప్రకటించారు. అటు బజరంగ్‌ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేశాడు. పద్మశ్రీ పురస్కారాన్ని బజ్‌రంగ్‌ పునియా వెనక్కి ఇచ్చేయడంపై మాట్లాడటానికి క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నిరాకరించారు.