Case On PM Modi: కొన్ని దశాబ్దాల తరువాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ఎన్నికల సమయంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్వల్ప ఆధిక్యంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా ఇండియా కూటమి సైతం మోదీ సర్కారును ఇరుకున పెట్టేందుకు తన ప్రయనుత్నాల ముమ్మరం చేసింది. తాజాగా స్పీకర్ ఎన్నిక విషయంలో పట్టుబట్టి ఓటింగ్ జరిగిన పరిణామాలు సైతం ఇదే సూచిస్తున్నాయి.


ప్రధాని మోదీపై ప్రైవేట్ ఫిర్యాదు 
బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీపై తాజాగా ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. ఫిర్యాదు ప్రకారం ఎన్నికల ప్రచార సమయంలో మోదీ రాజస్థాన్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి ప్రజలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని ఫిర్యాదుదారులు కోర్టుకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఈసారి దేశ సంపదను ముస్లింలకు మాత్రమే పంచాలని భావిస్తోందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై జియావుర్ రెహ్మాన్ కోర్టును ఆశ్రయించారు. 


వాస్తవానికి ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో సంపద, ఆదాయ అసమానతలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటూ ఏప్రిల్ లో రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధిరాన్ని చేజిక్కించుకుంటే ప్రైవేటు ఆస్తులను మళ్లీ పంచాలని చూస్తోందని అన్నారు. అయితే ఈ సంపద దేశంలోని ముస్లింలకు కాంగ్రెస్ పంచుతుందంటూ మత పరమైన ఆరోపణలు చేయడం దుమారం రేపింది. "దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు ఉందని కాంగ్రెస్ ప్రకటించింది" అని మోదీ సంచలనానికి తెరలేపారు.


కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక సర్వే నిర్వహించి సంపదను "పునర్విభజన" చేస్తామని హామీ ఇచ్చిందని అప్పట్లో మోదీ తన ఎన్నికల రాజకీయ ప్రసంగంలో చెప్పటం  దుమారాన్ని రేపింది. దేశంలోని వనరులపై ముస్లింలదే మొదటి హక్కు అని 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. దేశంలోని ప్రజల సంపదను చొరబాటుదారులకు, ఎక్కువ మంది సంతానం ఉన్నవారికి అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్నారు. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఎన్నికల ప్రచారంలో మోదీ అప్పట్లో ఈ ఆరోపణలు చేశారు. ఇవి ప్రజల్లో విద్వేషంతో పాటు భయాలను రేకెత్తించాయని పలువురు మోదీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే.