Railway General Tickets Online- రైల్వే స్టేషన్లలో జనరల్ టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  గత కొన్నేళ్లుగా కొన్ని పరిమితులతో సేవలందిస్తోన్న యూటీఎస్ (అన్ రిజర్వుడు టికెటింగ్ సిస్టమ్) యాప్‌నకు కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఏ ప్రదేశం నుంచి అయినా జనరల్ టికెట్లు యూటీఎస్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లో కూర్చొని కాచిగూడ స్టేషన్ నుంచి బెంగుళూరుకి అన్ రిజర్వుడు టికెట్..  అంటే..  జనరల్ టికెట్ బుక్ చేసుకుని నేరుగా రైలు వచ్చే సమయానికి స్టేషన్‌కొచ్చి జర్నీ చేసే వీలు కల్పించింది.  క్యూలైన్లో కుస్తీ పట్టే పరిస్థితికి దాదాపు స్వస్తి పలికినట్లే. 


యూటీఎస్ యాప్ అంటే ఏంటి..? 


2018 నవంబర్లో ఈ యూటీఎస్ యాప్‌ను ఇండియన్ రైల్వేస్ లాంచ్ చేసింది.  ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న ఉన్న మొబైల్ ఫోన్లలో దీన్ని  ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 2022లో దీనికి కొన్ని అప్డేట్లు తీసుకొచ్చి ప్రజలకు చేరువ చేశారు. దీని వాడకం క్రమంగా పెరుగుతుండటంతో దీనికి ఉన్న పరిమితులను క్రమంగా సడలిస్తూ వస్తోంది ఇండియన్ రైల్వేస్. ప్రస్తుతం దాదాపు 25 శాతం మంది ప్రయాణికులు ఈ యూటీఎస్‌ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నారని సంస్థ తెలిపింది.  తొలుత దీనికి చాలా పరిమితులు ఉండేవి.  టికెట్ బుక్ చేసుకునేందుకు మొబైల్ లో లొకేషన్ ఆన్ లో ఉండాలి. ఆ జియో లోకేషన్ స్టేషన్ కు 50 కిలోమీటర్ల లోపు లొకేటయ్యి ఉండాలి.  అప్పుడే టికెట్ బుక్ చేసుకొవచ్చు. అలాగే స్టేషన్కు కనీసం 15 మీటర్ల దూరం ఉంటే మాత్రమే టికెట్‌ని బుక్ చేసుకొనే వీలుండేది.


ఎక్కడ ఉన్నా మొబైల్ యాప్ ద్వారా జనరల్ టికెట్ 


కొత్తగా వచ్చిన అప్ డేట్ ద్వారా స్టేషన్‌కు గరిష్టంగా ఎంత దూరంలో ఉన్నారన్న దానితో సంబంధం లేకుండా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే స్టేషన్ వద్ద బుక్ చేసుకోవాలంటే మాత్రం స్టేషన్‌ బయటకు అయిదు మీటర్ల దూరం వెళ్లాలి.  అప్పుడే ఈ యాప్ పనిచేస్తుంది. అంటే ఈ యాప్‌ పనిచేయాలంటే లొకేష్ ఖచ్చితంగా ఆన్‌లో ఉండాలి.  గతంలొ 15 మీటర్లుగా ఉన్న దూరాన్ని అయిదుకు కుదించారు.  వినియోగదారుల నుంచి దూరం నిబంధనలపై తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో ఇండియన్ రైల్వేస్ ఈ కొత్త అప్ డేట్‌ను విడుదల చేసింది. 


క్యూలైన్ లో గంటలు..  సీటు దొరక్క ఇక్కట్లు.. 


స్లీపర్ క్లాస్ నుంచి ఫస్ట్ ఏసీ వరకు రిజర్వేషన్ సౌలభ్యమున్న క్లాసుల్లో ప్రయాణం ఒక ఎత్తయితే.. రిజర్వేషన్ అవకాశం లేని జనరల్ బోగీల్లో ప్రయాణం మరో ఎత్తు. ఇప్పుడు కొద్దిగా నయం కానీ.. గతంలో అయితే జనరల్ టికెట్ కావాలంటే గంటలు గంటలు స్టేషన్ల వద్ద క్యూలో నిల్చోవాలి. రైలు వచ్చే టైంకి టికెట్ దొరకక పోతే.. ఆఖరి నిమిషంలో రైలెక్కే పరిస్థితి వస్తే సీటు దొరికే అవకాశమే ఉండదు. నిల్చొనే ప్రయాణం చేయాలి.  ఇదంతా ఎందుకని.. చాలా మంది రిజర్వేషన్లకే ఎక్కువగా మొగ్గు చూపుతారు.  ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.  తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది.