Justice Rohit Deo Resign: బాంబే హైకోర్టులో శుక్రవారం అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. కోర్టు హాలులోనే న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా కోర్టు హాలులోని వారంతా షాక్ కు గురయ్యారు. ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా తాను పని చేయలేనని వ్యాఖ్యానిస్తూ జస్టిస్ రోహిత్ డియో రాజీనామా చేశారు. బాంబే హైకోర్టు లోని ఓ బెంచ్ కు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రోహిత్ డియో శుక్రవారం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. 'నేను రాజీనామా చేశా. ఈ విషయాన్ని మీకు చెప్పేందుకు చింతిస్తున్నా. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నేను పని చేయలేను. మీరు కష్టపడి పని చేయండి' అని కోర్టులో ఉన్న న్యాయవాదులతో జస్టిస్ రోహిత్ డియో అన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే తన పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. రాష్ట్రపతి ముర్ముకు తన రాజీనామా లేఖను పంపించినట్లు వెల్లడించారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉండగానే జస్టిస్ రోహిత్ డియో తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. 


రాజీనామా ప్రకటన చెబుతున్న సమయంలోనే.. కోర్టులోని న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి ఆయన క్షమాపణ కూడా చెప్పారు. 'కోర్టులో ఉన్న న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందరికి క్షమాపణలు చెబుతున్నాను. నేను ఎన్నోసార్లు మీపై ఆగ్రహం వ్యక్తం చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాలని అలా చేయలేదు. మీరు మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతోనే మీపై కోప్పడ్డాను. మీరంతా నా కుటుంబ సభ్యుల లాంటి వారు' అని జస్టిస్ రోహిత్ డియో చెప్పినట్లు ఓ న్యాయవాది మీడియాతో చెప్పుకొచ్చారు. కోర్టు బయట మీడియోతో మాట్లాడారు జస్టిస్ రోహిత్ డియో. తన వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. 'నా రాజీనామా లేఖ రాష్ట్రపతికి పంపించాను. వ్యక్తిగత కారణాలతోనే నేను నా సర్వీసుకు రాజీనామా చేశాను' అని జస్టిస్ రోహిత్ డియో తెలిపారు. 


న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో 2017లో మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వొకేట్ జనరల్ గా పని చేశారు. అదే ఏడాది జూన్ లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. 2019 ఏప్రిల్ లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2025 డిసెంబర్ 4వ తేదీన ఆయన పదవీ కాలం పూర్తికానుంది. అయితే శుక్రవారం ఆయన అనూహ్యంగా రాజీనామా చేశారు. 


Also Read: Apple India Revenue: భారత్‌లో జూన్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాల రికార్డు, రెండంకెల వృద్ధి నమోదు


మహారాష్ట్ర సర్కారు తీర్మానంపై స్టే ఇచ్చిన జస్టిస్ డియో


మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను జస్టిస్ రోహిత్ డియో గత సంవత్సరం నిర్దోషిగా ప్రకటించారు. సాయిబాబాకు విధించిన జీవిత ఖైదు తీర్పు కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అలాగే మైనర్ ఖనిజాల అక్రమ తవ్వకాలకు సంబంధించి సమృద్ధి మహామార్గ్ లో పని చేస్తున్న కాంట్రాక్టర్లపై శిక్షార్హత చర్యలను రద్దు చేయాలని ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. దీనిపై జస్టిస్ రోహిత్ డియో జులై 26వ తేదీన స్టే విధించారు. ఈ క్రమంలోనే జస్టిస్ డియో రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.