Loksabha Elections 2024: 


యూపీపైనే దృష్టంతా..


2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. అటు కాంగ్రెస్‌ విపక్షాలను ఒక్కటి చేసే పనిలో బిజీగా ఉంది. అయితే...బీజేపీ ప్లాన్ కాస్త భారీగా ఉన్నట్టుగానే తెలుస్తోంది. దేశంలోనే అత్యధిక ఎంపీ సీట్‌లు ఉన్న యూపీపై స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతోంది కాషాయ పార్టీ. యూపీలో 80 ఎంపీ స్థానాలున్నాయి. ఇక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకుని అత్యధిక సీట్లు సాధిస్తే బీజేపీకి పట్టు దొరుకుతుంది. అందుకే...ఇక్కడ కుల సమీకరణలపై దృష్టి పెట్టింది. ఓబీసీ ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గ బ్రహ్మాస్త్రం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఓబీసీ వర్గానికి చెందిన కీలక నేతలు, ఓటర్లతో ప్రత్యేకంగా చర్చించనుంది. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ వర్గంలో వెనకబడిన వాళ్లకు సంక్షేమ ఫలాలు అందేలా వ్యూహాలు రచించనుంది. వీటితో పాటు ఓబీసీ మోర్చా నేతృత్వంలో "థాంక్యూ మోదీ" కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయనుంది. యూపీలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తూ...ఓబీసీ ఓటర్లకు దగ్గరవ్వాలని బీజేపీ భావిస్తోంది. 


ఓబీసీ వర్గానికి వల..


బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు కార్యకర్తలు. OBC వర్గానికి చెందిన డాక్టర్లు, సాధువులు, సైంటిస్ట్‌లు, ఆఫీసర్లు, టీచర్లు..ఇలా అందరితోనూ చర్చలు జరిపి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఓబీసీ కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించడంతో పాటు ఈ వర్గ ప్రజలకు ఉన్న హక్కులపైనా అవగాహన కల్పించనుంది. NEET ఎగ్జామ్‌లో ఓబీసీ విద్యార్థులకు 27% రిజర్వేషన్‌లు కల్పిస్తామని హామీ ఇవ్వనుంది. అంతే కాదు. మోదీ కేబినెట్‌లోనూ OBC నేతలే ఎక్కువ మంది ఉండేలా జాగ్రత్త పడనుంది. ప్రస్తుత మోదీ కేబినెట్‌లో 35% మంది ఈ వర్గానికి చెందిన వాళ్లే కావడం గమనించాల్సిన విషయం. జూన్ 14 నుంచి 20వ తేదీ వరకూ ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని హైకమాండ్ రెడీ అవుతోంది. కర్ణాటక ఎన్నికల తరవాత బీజేపీ ఆత్మపరిశీలనలో పడింది. అటు RSS కూడా బీజేపీకి  కీలక సలహాలిచ్చింది. ఫలితంగా..అధిష్ఠానం అప్రమత్తమైం ఇప్పటి నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని చూస్తోంది. 


RSS సలహాలు..


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) బీజేపీకి కీలక సలహా ఇచ్చింది. "ఆత్మపరిశీలన" చేసుకోండి అని సూచించింది. అంతే కాదు. లోకల్‌గా క్యాడర్ పెంచుకోకుండా ఏ రాష్ట్రంలోనైనా గెలవడం కష్టమేనని తేల్చి చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, హిందుత్వ రాజకీయాలు అన్ని చోట్లా పని చేయవని స్పష్టం చేసింది. ఎన్నికల్లో గెలవడానికి ఇవి మాత్రమే సరిపోవని వెల్లడించింది. ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్నీ గుర్తు చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడానికి గల కారణాలనూ ప్రస్తావించింది RSS.కర్ణాటకలో బీజేపీ జాతీయ రాజకీయాల గురించి పదేపదే ప్రస్తావించిందని చెప్పిన ఆర్ఎస్‌ఎస్..కాంగ్రెస్ పూర్తిగా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టిందని వివరించింది. కాంగ్రెస్ ఘన విజయం సాధించడానికి ఇదే కారణమని తెలిపింది. ఇక్కడ కుల రాజకీయాలతో ఓట్లు రాబట్టుకోవాలని చూశారని...కానీ కర్ణాటక ఓటర్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదని స్పష్టం చేసింది RSS. 


Also Read: Viral Video: ఢిల్లీ మెట్రోలో యువకుల పిచ్చి చేష్టలు, డోర్‌కి కాళ్లు అడ్డం పెడుతూ నవ్వులు - వైరల్ వీడియో