BJP: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైనన ఉద్రిక్తతల వేళ.. ట్రూడో రాజీ పడ్డారని బీజేపీ విమర్శించింది. గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు సంబంధించిన సాక్ష్యాలను, పత్రాలను భారత ప్రభుత్వం అందించిందని, అయితే కెనడా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ బుధవారం తెలిపింది. ఇది ట్రూడో రాజీ పడ్డారు అనేదానికి నిదర్శనమని పేర్కొంది.


బ్రిటీష్ కొలంబియాలో జరిగిన నిజ్జర్ హత్యలో భారత దేశ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఆర్పీ సింగ్ మాట్లాడారు. 'సాక్ష్యాధారాలు ఉంటే సమర్పించండని ఎస్ జైశంకర్ సరిగ్గానే చెప్పారు. భారత ప్రభుత్వం గ్యాంగ్‌స్టర్ లు, ఉగ్రవాదులు, అలాగే అటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులకు సంబంధించిన సాక్ష్యాలను, పత్రాలు అందించింది. అయితే కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది ప్రభుత్వం రాజీ పడిందని చూపిస్తుంది' అని ఆర్పీ సింగ్ వ్యాఖ్యానించారు.


హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా నిర్దిష్ట సమాచారాన్ని అందిస్తే చర్యలు తీసుకుంటామని గతంలో ఎస్ జైశంకర్ తెలిపారు. 'మేం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం' అని ఆర్పీ సింగ్ అన్నారు. 






'ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు'


హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్. న్యూయార్క్‌లో Council on Foreign Relations ఈవెంట్‌లో పాల్గొన్న ఆయనను మీడియా ప్రశ్నించింది.  Five Eyes ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌పైనా స్పందన ఏంటని అడిగింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన జైశంకర్...ఆ ఇంటిలిజెన్స్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. FBIతో ఏ మాత్రం సంబంధం లేని తనను ఈ ప్రశ్నలు అడగడం సరికాదని స్పష్టం చేశారు. ఆ తరవాత కూడా మీడియా ప్రశ్నించింది. నిజ్జర్‌ హత్య గురించి ముందుగానే కెనడా భారత్‌కి చెప్పిందని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చిందన్న అంశాన్ని మీడియా ప్రస్తావించింది. అందుకు జైశంకర్ దీటుగానే బదులిచ్చారు. ఎవరైనా అలాంటి సమాచారం అందిస్తే కచ్చితంగా అలెర్ట్ అవుతామని వెల్లడించారు. నిజ్జర్ హత్యకి సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. 


కెనడాలో చాలా ఏళ్లుగా నేరాలు జరుగుతున్నాయని, ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయని అన్నారు జైశంకర్. అక్కడి ఉగ్ర కార్యకలాపాలపై భారత్ ఎప్పుడో కెనడాని అప్రమత్తం చేసిందని, అయినా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు.