తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారని దూబే ఆరోపించారు. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌ చేసి మాట్లాడేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి మహుబా డబ్బులు తీసుకున్నారని అన్నారు. పారాదీప్, ధమ్రా పోర్ట్ నుంచి చమురు, గ్యాస్‌ సరఫరా, యూరియా సబ్సిడీ, రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపుతున్న ఉక్కు ధరలు, ఆదాయపు పన్ను శాఖ అధికారాలపై మహువా ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు. తక్షణమే ఆమెను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ, స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించడం, సభా ధిక్కారం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. 


ఖరీదైన బహుమతులు 
ఓ కాంట్రాక్టు అదానీ గ్రూపునకు దక్కడంతో హీరానందానీ గ్రూపు వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు ఎంపీ మహువా మొయిత్రా ప్రయత్నించారని నిషికాంత్ దూబే ఆరోపించారు. హీరానందానీ గ్రూపునకు అనుకూలంగా ప్రశ్నలు అడిగినందుకు  రూ.2కోట్లు, ఐఫోన్‌ వంటి ఖరీదైన బహుమతులు, ఎన్నికల్లో పోటీకి రూ.75లక్షలు ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు. ఎంపీ మహువా, వ్యాపారవేత్త మధ్య లంచాల మార్పిడికి సంబంధించి ఆధారాలను ఓ లాయర్ తనకు ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు మహువా అడిగారని నిషికాంత్‌ తెలిపారు. 


నకిలీ అఫిడవిట్లపై ముందు దర్యాప్తు చేశాక...
నిషికాంత్‌ దూబే ఆరోపణలకు మహువా మొయిత్రా కౌంటర్ ఇచ్చారు. నిషికాంత్‌ దుబేపై నకిలీ అఫిడవిట్లు, ఇతర అభియోగాలపై దర్యాప్తు పూర్తి చేశాక తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తానని స్పష్టం చేశారు. నిషికాంత్  ఆరోపణల్ని హీరానందానీ గ్రూప్‌ కొట్టిపారేసింది. ఆయన ఆరోపణల్లో నిజం లేదన్న సంస్థ, తాము ఎప్పుడూ వ్యాపారంలోనే ఉన్నామని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసమే తమ గ్రూపు ఎప్పుడూ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని, దాన్నే కొనసాగిస్తుందని తెలిపింది. 


చార్టర్డ్ ఫ్లైట్‌ టేకాఫ్ కోసం ఏటీసీపై దూబే ఒత్తిడి
నిషికాంత్ దూబే ఝార్ఖండ్ లోని గొడ్డా పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందారు. గత ఏడాది ఝార్ఖండ్‌లోని దేవఘర్ విమానాశ్రయం నుంచి తమ చార్టర్డ్ ఫ్లైట్‌ టేకాఫ్ కోసం క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేయడంతో కేసు నమోదైంది. ఆగస్టు 31న లోక్‌సభ సభ్యుడు నిషికాంత్ దూబే, ఆయన కుమారుడు కనిష్క్ కాంత్ దూబే, మహికాంత్ దూబే, ఎంపీ మనోజ్ తివారీ, ముఖేష్ పాథక్, దేవతా పాండే, పింటూ తివారీలు భారీ భద్రత ఉండే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ లోకి ప్రవేశించారు. దేవఘర్ విమానాశ్రయం నుంచి తమ చార్టర్డ్ ఫ్లైట్ టేకాఫ్ కావడానికి క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విమానాశ్రయ డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు మేరకు బీజేపీ నేతలపై కేసు నమోదు చేశారు.